ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం
మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన స్వగ్రామం తారువాలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని నాలుగుసార్లు అసెంబ్లీలో డిమాండ్ చేశానన్నారు. రైవాడ జలాశయం నీరు రైతులకు అంకితం చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ నుంచి రైవాడ జలాశయంకు రావాల్సిన రూ.110 కోట్లు విడుదల రైవాడ ఆధునికీకరణ చేపట్టాలని డిమాండ్ చేశానని వివరించారు.
హుద్‌హుద్ తుపాను బాధితులకు నష్టపరిహారం అందకపోవడాన్ని అసెంబ్లీలో లేవనెత్తి పోరాటం చేశానన్నారు. నియోజకవర్గంలో అసంపూర్తి జలాశయాలను పూర్తి చేసి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులను నిత్యం సందర్శిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేసినట్టు చెప్పారు.
పార్టీలో సముచిత స్థానంపై ఆనందం: ఎమ్మెల్యేగా మొదటి సారిగా ఎన్నికైనప్పటికీ వైఎస్సార్సీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా ఎంపికచేసి పార్టీలో సముచిత స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల అసెంబ్లీలో అదనంగా మాట్లాడే అవకాశం లభించిందన్నారు. డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా ఎంపిక చేసిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. గత ఎమ్మెల్యే మాదిరిగా కాకుండా నిత్యం స్వగ్రామం తారువాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తున్నట్టు బూడి తెలిపారు.