అబద్ధం చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాడు
నమ్మించి మోసగించి ఓ యువతిని రెండో వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలిపిన వివరాలివీ..మెహిదీపట్నం టౌలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ అలీ (35), కమరున్నీసా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. మహ్మద్ అహ్మద్ అలీ గుడిమల్కాపూర్‌లో తాజ్ బాబా ప్లవర్ మార్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడు కొన్ని నెలల క్రితం యాకుత్‌పురా వహేద్ కాలనీ నివాసి కుత్బుద్దీన్ కుటుంబంతో పరిచయం ఏర్పచుకున్నాడు.
కుత్బుద్దీన్ దుబాయ్‌లో ఉంటుండగా... ఆయన భార్య అక్తర్ సుల్తానా ముగ్గురు కూతుళ్లతో కలిసి వహేద్ కాలనీలోని సొంతింట్లో ఉంటోంది. కాగా, అహ్మద్ అలీ.. అక్తర్ సుల్తానా వద్ద వ్యాపారం కోసమంటూ రూ.35 లక్షలు తీసుకున్నాడు. తనకు వివాహం కాలేదని నమ్మించి అక్తర్ సుల్తానా చిన్న కూతురు బీటెక్ చదివిన ఆఫ్సా సలీమా (27)ను ఈనెల 5న వివాహం చేసుకున్నాడు.
పెళ్లికి హాజరైన వారి ద్వారా అహ్మద్ అలీకి ఇదివరకే పెళ్లయిన విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. దీంతో అక్తర్ సుల్తానా కుటుంబ సభ్యులు అహ్మద్ అలీతో గొడవ పడ్డారు. మోసం చేశాడంటూ వారు గురువారం రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్ అలీపై ఐపీసీ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.