అజారుద్దీన్ జీవిత కథతో సినిమా
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర, వెండితెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ క్రీడాకారుడు క్రికెట్‌కు అందించిన విశేష సేవలను ఎవరూ మరచిపోరు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం మాత్రం పలు ఆసక్తికరమైన మలుపులు తిరగడం గమనార్హం. అజారుద్దీన్ నవ్రిన్ అనే హైదరాబాద్ యువతిని వివాహం చేసుకుని తొమ్మిదేళ్లు కాపురం చేసి ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడాకులు పొందారు. ఆ తరువాత నటి సంగీత బిజ్లానీతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 1986లో వీరిద్దరూ ఒకటయ్యారు.
అయితే 14 ఏళ్ల సంసార జీవితం అనుభవించిన తరువాత 2010లో విడిపోయారు. ఆ తరువాత ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణితో అజారుద్దీన్ షికార్లు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అజారుద్ధీన్ ఖండించారు. అజారుద్దీన్‌కు తొలి భార్య నవ్రిన్కు అసాద్, అరుష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో 19 ఏళ్ల అరుష్ ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించాడు. ఇలాంటి మలుపులతో కూడిన అజారుద్దీన్ జీవిత ఇతివృత్తంతో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. బాలీవుడ్ మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి అజారుద్దీన్ నుంచి అనుమతి పొందినట్లు తెలిసింది. దీనికి కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.