జోరుగా యూనినార్ రిటైల్ స్టోర్ల విస్తరణ
న్యూఢిల్లీ: మొబైల్ సర్వీసులందజేసే యూనినార్ సంస్థ ఒక్క రోజులో 367 ఎక్స్క్లూజివ్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో తమ రిటైల్ స్టోర్ల సంఖ్య 1,480కు పెరిగిందని యూనినార్ సీఈవో మోర్టెన్ కార్ల్సన్ సోర్బీ మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్... ఈ ఆరు సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. ఈ ఆరు సర్కిళ్లలో అత్యధిక ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉన్న రెండో అతి పెద్ద మొబైల్ సర్వీసుల కంపెనీ తమదేనని సోర్బీ పేర్కొన్నారు.
ఈ స్టోర్స్ల్లో కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రీచార్జ్ చేస్తామని, వినియోగదారుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని, పోస్ట్, ప్రి పెయిడ్.. అన్ని తరహా వినియోగదారులందరికీ పూర్తి స్థాయిలో సర్వీసులందజేస్తామని వివరించారు. గతంలో నెట్వర్క్ను విస్తరించామని, ఇప్పుడు రిటైల్ స్టోర్లను విస్తరించామని, దీంతో వినియోగదారుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది తమ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపవగలదని పేర్కొన్నారు.