కళామతల్లి సిగలో కర్నూలు నందివర్ధనం
కర్నూలు(కల్చరల్): జెండాపై కపిరాజు..బావా ఎప్పుడు వచ్చితీవు.. చెల్లి యో చెల్లకో.. ఔరా.. ఈ రచనా చమత్కృతి ఏమియోగాని.. కర్నూలు జిల్లా పల్లె సీమల్లో ఈ పౌరాణిక పద్యాలు.. భారీ సంభాషణలు వినని వారు ఉండరు. శివరాత్రి, దసరా, సంక్రాంతి, జాతరలు.. దేవరలు.. పల్లెల్లో జరిగే పండుగలకు రచ్చబండలే రంగస్థల వేదికలవుతాయి. రైతన్నలే రంజైన పద్యం చెప్పే కళాకారులవుతారు.. ఆధునిక యుగంలో కర్నూలు నాటకం పరిపక్వమయింది.
చెదిరిన ఉమ్మడి కుటుంబాలు.. వలస బాట పట్టిన కూలీలు.. ఫాక్షన్ మహమ్మారి.. పెట్రేగిన పాశ్చాత్య సంస్కృతి.. తదితర అంశాలే నాటక ఇతివృత్తాలయ్యాయి. కర్నూలు జిల్లా నాటకం పల్లె సీమ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. కర్నూలు జిల్లాలో నాటకాల నడక ప్రారంభించిన వారు వెండితెరపై వెలుగుతున్నారు. 1940 నాటి మాధవ విలాస్ నుంచి నేటి లలిత కళా సమితి వరకు ఎన్నెన్నో నాటక సమాజాలు ఆవిర్భవించి అద్వితీయమైన నాటకాలు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కర్నూలు ప్రతిభను ఇనుమడింపజేశాయి.
వెల్దుర్తి వెంకటనర్సు నాయుడు, లొద్దిపల్లె, అల్లబక్ష్, కల్లూరి శేషయ్య, పెదపాడు పాండురంగయ్య, సీతారామమ్మ, రజనీబాయి, గొల్లా పిన్ని ప్రభాకర్, సంజన్న, సయ్యద్అహ్మద్ కర్నూలు జిల్లా రంగస్థలానికి సుందరమైన తోరణాలయ్యారు. ఎందరో నటులు నంది నాటకోత్సవాల్లో పాల్గొని నంది పురస్కారాలు పొంది కర్నూలు కళామతల్లి సిగలో నందివర్ధనాలయ్యారు.
120 ప్రదర్శనల పులిస్వారీ..
జిల్లాలోని ముఠా కక్షల ఇతివృత్తంతో ప్రసిద్ధ రచయిత విజయభాస్కర్ రాసిన ‘పులిస్వారి’ నాటకం రాష్ట్ర వ్యాప్తంగా 120 ప్రదర్శనలు పూర్తి చేసుకోవ డం ఓ సరికొత్త రికార్డు. ఈ నాటక ఇతివృత్తం కొ న్ని సినిమాలకు మూలకథగా తీసుకున్నారు. లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య దర్శకత్వం లో రూపొందిన ఈ నాటకం కర్నూలు జిల్లా నాటక రంగంలో ఓ మరుపురాని మైలురాయి. ఈ సంస్థ ద్వారా గోపిశెట్టి వెంకటేశ్వర్లు, మహ్మద్ మియా, వన్నెం బలరాం నంది అవార్డులు సాధించారు. ఇటీవల నంది నాటకోత్సవాల్లో బబ్రువాహన విజయం స్వర్ణ నంది సాధించడం లలిత కళా సమితి నాటక ప్రతిభకు తార్కాణంగా నిలిచింది.
నేడు 5వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభం
టీజీవీ కళా క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 5వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఒక్క క్షణం, 7.30 గంటలకు ఆనందం అనే నాటకాలు ప్రదర్శిస్తారు. నాలుగు రోజులు కర్నూలులో నాటకాల పండుగ నిర్వహిం చనున్నారు.