ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
వారణాసి లోకసభ స్థానంపై దేశవ్యాప్తంగా దృష్టి పడింది. ఎందుకంటే వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ లు పోటికి నిలవడంతో ఆస్థానంపై ఆసక్తి పెరిగింది. అలానే తెలంగాణ ప్రాంతంలోని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి స్థానం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందుకు కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్, లోకసత్తా వ్యవస్థాపకుడు ఎన్ జయప్రకాశ్ నారాయణ్ పోటికి ఆసక్తి చూపడమే.
గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుమారుడు లోకేష్ ను బరిలోకి దించాలని అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు భావించిన ఎందుకనో వెనుకంజ వేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా బరిలో దిగేందుకు తహతహలాడారు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, జేపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఉండటంతో పలు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఎల్ బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఇతర స్థానంలో అత్యధికంగా తెలంగాణేతర ఓటర్లు ఉన్న కారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీలు మల్కాజ్ గిరి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే స్థానంలో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారో అనే విషయం కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం.