సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి కన్నుమూత
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన్ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. నర్రా రాఘవరెడ్డి స్వస్థలం చిట్యాల మండలం వట్టిమర్తి. నకిరేకల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఎన్నో సేవలను అందించారు.
1924లో కమలమ్మ, రామిరెడ్డి దంపతులకు చిట్యాల మండలం వట్టిమర్తిలో పుట్టిన నర్రా రాఘవరెడ్డి.. 1950లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. తొలిసారి 1967లో నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 1967, 73, 83, 84, 89, 93 సంవత్సరాల్లో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వచ్చారు. తర్వాత ఆయన అనారోగ్యానికి గురి కావడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తుంటే ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, స్పీకర్లు కూడా మంత్రముగ్ధులై వినేవారు. అసెంబ్లీ ప్రసంగాల్లో సమయం, సందర్భాలకు తగినట్లుగా సామెతలు చెప్పడంలో ఆయన దిట్ట. అలాగే అధికార పక్షానికి కీలెరిగి వాతపెట్టడంలో కూడా ఆయనను మించినవారు లేరు. ఏమాత్రం ఆవేశ కావేషాలకు పోకుండానే.. సుతిమెత్తగా వాతలు పెడుతూ తనకు కావల్సిన సమాధానాలను అధికార పక్షం నుంచి రప్పించుకునేవారు. చిట్టచివరి వరకు నీతి నిజాయితీలే ఆస్తిగా బతికారు తప్ప.. ఆస్తులు వెనకేసుకోలేదు. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపేవారు.
ముంబాయికి వలస..
రాఘవ రెడ్డి ముంబాయికి వెళ్లి.. 13రూపాయల వేతనానికి గైక్వాడ్ జౌళి మిల్లులో చేరారు. అక్కడ కార్మికులు పని గంటల కోసం పోరాడే సమయంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడే కార్మిక నాయకుడిగా ఎదిగారు. ఆయన 1948లో తిరిగి స్వగ్రామం వట్టిమర్తికి చేరుకున్నారు.
రజాకారులకు వ్యతిరేకంగా..
1948లో తెలంగాణ సాయుధ పోరాటం సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు మండలం పలివెల గ్రామంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించారు.. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో నిర్వహిస్తున్న ఉద్యమాలకు ఆకర్షితుడై ఉద్యమంలో పనిచేశారు.
రాజకీయాలలో చెరగని ముద్ర
రాజకీయాలపై నర్రా రాఘవరెడ్డి చెరగని ముద్ర వేశారు. 1949లో పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఇచ్చింది. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలో గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలుకొని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని వరకు వివిధ హోదాలలో పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో గ్రామ స్థాయిలో చురుకుగా పని చేయడంతో 1959 లో వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ఏడేళ్ల పాటు పని చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైన ఏడాదే 1959 లో నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికై 1964 వరకు కొనసాగారు.
మొత్తంగా ఆయన 90 ఏళ్ల జీవితంలో సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా సుమారు 37 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా కొనసాగారు.. 1983 నుంచి ఏడేళ్ల పాటు శాసన సభలో సీపీఎం పక్ష నాయకునిగా పని చేశారు. ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చిన తీసుకోకుండా ఆదర్శంగా ఉన్నారు. ఆరోగ్య కారణాలతో పార్టీ ప్రజా ప్రాతినిధ్య పదవి నుంచి తప్పుకున్నారు.
రాఘవరెడ్డి మృతిపట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, సీనియర్ నాయకుడు బీవీ రాఘవులు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తదితరులు సంతాపం తెలిపారు.