అయ్యో.. బిడ్డా
స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి దుర్మరణం
‘తల్లి’డిల్లిన హృదయం
‘అయ్యో..బిడ్డా. ఏమైందిరా. ఎందుకిలా జరిగిందిరా. లే కన్నా.. ఒక్కసారి మాట్లాడురా’ అంటూ విగతజీవిగా మారిన తన కుమారుడిపై పడి ఓ తల్లి రోదించిన తీరు అందరి హృదయాలను కరిగించింది.
రైల్వేకోడూరు రూరల్: రెల్వేకోడూరులోని ఆదర్శ పాఠశాల వ్యాన్ కింద పడి నాని(3) అనే చిన్నారి దుర్మరణం చెందాడు. మైసూరివారిపల్లె పంచాయతీ శాంతినగర్‌కు చెందిన జంగిటి నరసింహులు, సుభద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుటుంబ పోషణ నిమిత్తం నరసింహులు కువైట్‌కు వెళ్లాడు. సుభద్ర ఇక్కడే ఉండి పిల్లలను చదివించుకుంటోంది. గురువారం సాయంత్రం సుభద్ర రైల్వేకోడూరులోని తమ పుట్టింటికి వచ్చింది. సుభద్ర తమ్ముడి కుమారుడైన నందు ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన వెంటనే నందు వ్యాన్‌లో ఇంటికి బయలుదేరాడు. అయితే అదే బస్సు కింద పడి సుభద్ర కుమారుడు నాని మరణించాడు. ఇంట్లోనే ఉన్నాడనుకున్న నాని వ్యాన్ కింద ఎలా పడి చనిపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
తన కుమారుడు వ్యాన్ కింద పడి నలిగిపోయినట్లు తెలుసుకున్న సుభద్ర చిన్నారి గుండెలపై పడి రోదించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. బంధువులు, ఇరుగుపొరుగు వారితో సంఘటనా స్థలం నిండిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ గోపీ వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.