పొత్తు కుదిరింది..
► ఎస్పీ, కాంగ్రెస్ మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు
► 298 స్థానాల్లో ఎస్పీ, 105 సీట్లలో కాంగ్రెస్ పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కొంతకాలంగా నడుస్తున్న సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ 298 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ, మిగిలిన 105 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు నరేశ్‌ఉత్తమ్, యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ ఆదివారం లక్నోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తాయని, ఈ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జోక్యం చేసుకోవడంతో ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది.
బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితా
యూపీ ఎన్నికలకోసం బీజేపీ 155 మందితో తొలిజాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా 44 మందితో తొలి జాబితా విడుదల చేసింది.