మేమూ అంతరిక్షంలో విహరిస్తాం
వాషింగ్టన్: అంతరిక్షంలో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు దాదాపు 18,300 దరఖాస్తులు వచ్చాయి. 2012 ఏడాదిలో వచ్చిన వాటితో పోల్చితే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ అని నాసా అధికారులు తెలిపారు.
వేర్వేరు నేపథ్యాలు ఉన్న వారు మార్స్‌లో ప్రయాణించాలని కోరుకుంటున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లీ బోల్డెన్ పేర్కొన్నారు. అయితే ఇంటర్వ్యూల తర్వాత చాలా నైపుణ్యం కలిగిన అదృష్టవంతులైన 8 నుంచి 14 మందిని మాత్రమే ఎంచుకుంటామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్లో త్వరలోనే ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వీరికి 2017లో శిక్షణ తరగతులు ఉంటాయని వెల్లడించారు.