14 నుంచి జాతీయ బాలల చలనచిత్రోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: చిల్ట్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) నిర్వహించతలపెట్టిన మొట్టమొదటి జాతీయ బాలల చలనచిత్రోత్సవం ఈ నెల 14వ తేదీన స్థానిక సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డులు పొందిన సినిమాలతో పాటు నృత్యం సంగీతం, మ్యాజిక్, యానిమేషన్ తదితర చలనచిత్ర నిర్మాణంతో ముడిపడిన రంగాలకు సంబంధించి వర్క్‌షాపులను కూడా నిర్వహించనున్నారు. పరిశుభ్రతే ఇతివృత్తంగా ఈ చలనచిత్రోవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రతి రెండు సంవత్సరాల కోసారి హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంతో పాటు జాతీయ చలనచిత్రోత్సవాన్ని కూడా నిర్వహించాలని సీఎఫ్ఎస్ఐ నిర్ణయించింది. గోల్డెన్ ఎలిఫెంట్ ఫెస్టివల్ గా పేర్కొనే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరగని సంవత్సరాల్లో జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. జాతీయ చలనచిత్రోత్సవం కూడా రెండేళ్ల కోసారి జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవం కేవలం ఒక్క నగరానికే పరిమితం కాదు. ఢిల్లీలో మొదటిసారి జరిగిన తరువాత దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ నిర్వహిస్తారు.