‘కుటుంబ సంక్షేమం’ అరకొర!
రెండేళ్లుగా ఎన్ఎఫ్బీఎస్
నిధులను తగ్గిస్తున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: జాతీయ కుటుంబ సంక్షేమ పథకం(ఎన్ఎఫ్బీఎస్) నిధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా కోత పెడుతున్నాయి. సంపాదనాపరుడు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయమందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ అంచనాలకు, విడుదలవుతున్న నిధులకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్ఎఫ్బీఎస్కి కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులను తగ్గిస్తుండడంతో బాధిత కుటుంబాలకు అందించే ఆర్థికసాయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతపెడుతోంది.
దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించాల్సి ఉండగా, దానిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్ల బడ్జెట్ను కేటాయించిన కేంద్రం రూ.1.33 కోట్లను మాత్రమే విడుదల చేసింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.8.02 కోట్లు కేటాయించగా రూ.4.12 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఐదు నెలలైనా చిల్లిగవ్వ రాలేదు
2016–17 సంవత్సరానికి రూ.16 కోట్ల బడ్జెట్ ఇస్తామని పేర్కొన్న కేంద్రం 5 నెలలైనా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో బాధిత కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కేంద్రం నుంచి సరిపడా నిధులు రాకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని ఎన్ఎఫ్బీఎస్ అమలు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వాపోతున్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సినమొత్తాన్ని తగ్గించడం ఎంతవరకు సబబని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు రూ.20 వేలు చెల్లించేందుకు తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ సెర్ప్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.