యువకుడి ఆత్మహత్య
మేనకూరు(నాయుడుపేట) : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని మేనకూరు అరుంధతీయ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం.. ఓజిలి మండలం పెదపరియకు చెందిన వీరయ్య, పద్మమ్మ కుమారుడు నవీన్ (25)కు కోట మండలం గూడలికి చెందిన మల్లికతో ఏడాది క్రితం వివాహమైంది. మల్లికకు అంతకు ముందు మరో వ్యక్తితో వివాహమై విడిపోయారు. అప్పటి నుంచి నవీన్, మల్లిక మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు నెలల కుమార్తె ఉంది. పెళ్లైన మల్లికను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నవీన్ కుటుంబ సభ్యులు ఏడాది నుంచి వ్యతిరేకిస్తుండటంతో వివాదాలు జరుగుతుండేవి. దీంతో పెదపరియలో ఉండలేక నవీన్ ఇక్కెడికైనా వెళ్లి ఉందామంటూ భార్య మల్లికతో చర్చించాడు. మల్లిక అక్క మేనకూరు అరుంధతీయ కాలనీలో ఉండడంతో ఇద్దరూ నెల రోజులుగా అక్కడికెళ్లి నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. కాసేపటి తర్వాత ఇద్దరు నిద్రపోయారు. బుధవారం తెల్లవారు జామున నవీన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రలేచి చూసే సరికి నవీన్ ఉరికి వేలాడుతుండగా మల్లిక కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని కిందకు దించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నాయుడుపేట ఎస్సై పీవీ నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.