పాక్‌కు అమెరికా షాక్
► ఉగ్రపోరుపై అమెరికా సంతృప్తి చెందితేనే సైనిక సాయం
► ప్రతినిధుల సభలో 3 సవరణలకు ఆమోదం
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఆ మేరకు రక్షణ వ్యయాల బిల్లులో మూడు సవరణల్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని తాజా సవరణల్లో స్పష్టం చేశారు. 651 బిలియన్ డాలర్ల జాతీయ భద్రతా అధికార చట్టం(ఎన్డీఏఏ)– 2018 ఆమోదం సందర్భంగా ఈ సవరణల్ని ప్రతి పాదించారు. ఈ బిల్లును శుక్రవారం ప్రతినిధుల సభ 344–81 ఓట్ల తేడాతో ఆమోదించగా.. అది అమల్లోకి రావాలంటే ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్డీఏఏ యాక్ట్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
తాజా సవరణల ప్రకారం ఉత్తర వజిరి స్థాన్లోని హక్కాని నెట్‌వర్క్‌పై పాక్ సైన్యం పోరా టం కొనసాగించకపోతే అమెరికా నుంచి వచ్చే 400 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 2,600 కోట్లు) సాయం నిలిపివేస్తారు. పాకిస్తాన్– అఫ్గాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు పాక్ కృషిచేయాలి. అక్టోబర్ 1, 2017– డిసెంబర్ 31, 2018 మధ్య కాలానికి ఈ సాయం వర్తిస్తుంది. బిల్లులో రెండు సవరణల్ని కాంగ్రెస్ సభ్యుడు దానా రోహ్రబచెర్, మరో సవరణను టెడ్ పోయ్ ప్రతిపాదించారు.
అమెరికా ఉగ్రవాద జాబి తాలో చేర్చిన వారికి ఎలాంటి సైనిక, ఆర్థిక, ఇతర సాయాల్ని పాకిస్తాన్ అందించడం లేదని రక్షణ శాఖ ధ్రువీకరిస్తే తప్ప సాయం చేయరాదని సవరణలో పోయ్ పేర్కొన్నారు. తన సవరణ ఆమోదంతో అమెరికాను మోసగిస్తున్న పాక్ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఇస్లామాబాద్‌కు సైనిక సాయం చేయాలంటే పాకిస్తాన్ పనితీరుపై పెంటగాన్ సంతృప్తి చెందాల్సి ఉంటుందన్నారు.
భారత్–అమెరికా రక్షణ బంధం బలోపేతానికి ఆమోదం
మరోవైపు ఈ బిల్లు ద్వారా భారత్ – అమెరికాల మధ్య రక్షణ రంగ సంబంధాలు బలపడను న్నాయి. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతం కోసం భారత–అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బెరా ప్రతిపాదించిన సవరణను ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవర ణను అమెరికా రక్షణ శాఖ మంత్రి ధ్రువీకరించాలి. ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత్‌ల మధ్య రక్షణ సహకారం మరింత పెరిగేందుకు ఈ సవరణ ఎంతో సాయపడుతుం దని బెరా అభిప్రాయపడ్డారు.
నిషేధంపై ‘సుప్రీం’కు
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాల పౌరులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులను బలహీనపరిచేలా ఉన్న ఫెడరల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమెరికాలో సన్నిహిత సంబంధీకులు ఉన్నవారు వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని సదరు జడ్జి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హవాయ్ ఫెడరల్ జడ్జి ఆదేశాల రద్దు కోరుతూ ప్రభుత్వ న్యాయ విభాగం సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలుచేసింది.
సుప్రీంకోర్టు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నా అత్యవసర కేసుల విచారణను చేపడుతుంది. అమెరికాలో నివసిస్తున్న వారి అమ్మమ్మ, నానమ్మ , తాతయ్య, మనవడు, మనవరాలు, మరదలు, బాబాయ్, పిన్ని, మేనల్లుడు, మేనకోడలు, కజిన్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులు అమలుచేయొద్దని జడ్జి డెర్రిక్ వాట్సన్ గత వారం ఆదేశించారు. అమెరికా పునరావాస ఏజెన్సీల నుంచి హామీ పొందిన శరణార్థులను కూడా దేశంలోకి అనుమతించాలని కోరారు.