భూమా కుమారుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బేగంపేట,న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమానాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... జగత్ విఖ్యాత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఉప్పల్‌లో జరుగుతున్న క్రికెట్మ్యాచ్ చూడడానికి జూబ్లీహిల్స్ నుంచి నిస్సాన్ ఎక్స్‌ట్రయల్ కారు (ఏపీ21ఏఎఫ్09)లో డ్రైవర్‌తో కలిసి బయలుదేరారు. కారు బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ దిగుతుండగా రేడియేటర్ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు లేచాయి.
అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆపేశాడు. విఖ్యాత్‌రెడ్డితో పాటు డ్రైవర్ వెంటనే కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. రేడియేటర్ వేడెక్కడం వల్లనే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన వల్ల కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తల్లి శోభానాగిరెడ్డిని కోల్పోయిన విఖ్యాత్ అదృష్టవశాత్తు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు వేరే వాహనంలో విఖ్యాత్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు.