డిజిటల్ ఫొటోలలో తగినంత డెప్త్ లేదు: ఇళయరాజా
ఫొటోగ్రఫీ అంటే ప్రాణం పెడతారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. అలాంటిది, డిజిటల్ ఫొటోగ్రఫీ వచ్చిన తర్వాత అసలు అది తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెబుతున్నారు. ''అంతా డిజిటల్ మయమైపోయినప్పటి నుంచి నాకు అసలు ఫొటోలు తీయడంపైనే ఆసక్తి చచ్చిపోయింది. రీల్ వేసి ఫొటో తీసినదాంట్లో వచ్చినంత డెప్త్ ఇప్పుడు డిజిటల్ ఫొటోలలో రావట్లేదు. డిజిటల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఓ అద్భుత ప్రపంచాన్ని నాశనం చేశాం" అని ఇళయరాజా అన్నారు.
ముందుగానే సంగీతంతో విపరీతంగా బిజీ అయిపోయిన ఇళయరాజాకు ఫొటోలు తీయడానికి సమయమే చిక్కడంలేదు. కేవలం ప్రయాణాలు చేసేటప్పుడే ఫొటోలు తీస్తారు. సమయం పెద్దగా లేకపోయినా, గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఇళయరాజా దాదాపు 5వేల ఫొటోలు తీశారు. ఇటీవలే ఆ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. తాను 1978లో ఫొటోలు తీయడం మొదలుపెట్టానని, బయటకెళ్లి ఫొటోలు తీసే సమయం లేకపోయినా.. వీలైనప్పుడల్లా తీసేవాడినని ఇళయరాజా చెప్పారు. ప్రకృతి చిత్రాలు తీయడం ఇష్టమని, గత కొన్నేళ్లుగా తాను చాలా కెమెరాలు కొని దాదాపు 5వేల ఫొటోలు తీశానని అన్నారు. నిజమైనవి, కదులుతున్నవాటినే తాను ఫొటో తీసేవాడినని, అవేవో ఊరికే తీసినవి కావని, వాటిలో జీవం ఉందని ఆయన తెలిపారు. ఒకసారి బెంగళూరులో ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే చాలా బాధగా అనిపించి ఫొటో తీశానని, కాసేపటి తర్వాత చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇతర నగరాలతో పాటు సింగపూర్, దుబాయ్, లండన్ లాంటి చోట్ల కూడా తన ఫొటోలతో ఎగ్జిబిషన్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు.