అమ్మ మృతిలో మిస్టరీ లేదు
♦ త్వరలో జయ చికిత్స ఫొటోలు విడుదల చేస్తాం
♦ అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది వెల్లడి
♦ అమ్మ మరణంపై అనుమానాలున్నాయి: పన్నీర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయ మరణంపై నెలకొన్న అనుమానాలను కొంత వరకు నివృత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేస్తానని టీటీవీ దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో ప్రకటించారు. మరణం వెనుక ఎటువంటి మిస్టరీ లేదని ఆయన అన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రెండుగా చీలిపోయిన పార్టీ మళ్లీ ఏకం అయ్యేందుకు ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. అయితే జయలలిత మరణంపై సీబీఐ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని, శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ప్రధానంగా రెండు షరతులు విధించింది.
అయితే ఈ షరతులను శశికళ వర్గం తోసిపుచ్చడంతో ఇరువర్గాల విలీనానికి విఘాతం ఏర్పడింది. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలు, అమ్మ మరణం తదితర అంశాలను ప్రస్తావిస్తూ నేటి నుంచి పన్నీర్‌సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తున్నారు. పన్నీర్ పర్యటనను నీరుగార్చేందుకు శశికళ వర్గం కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో బహిరంగ సభ నిర్వహించారు. దినకరన్‌పై కేంద్ర ప్రభుత్వం బూటకపు కేసులను బనాయించిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దినకరన్‌పై పెట్టిన కేసులను కొట్టివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనుమతి రాగానే ఫొటోలు బహిర్గతం: పుహళేంది
ఈ సందర్భంగా పుహళేంది మీడియాతో మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన చికిత్సను అనుమానిస్తూ అమ్మ మరణం వెనుక మిస్టరీ ఉందని కొందరు నిందలు వేస్తున్నారని అన్నారు. అందుకే జయలలిత చికిత్స పొందతున్నప్పటి ఫొటోలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫొటోల విడుదలపై తగిన అనుమతి రాగానే బహిరంగ పరుస్తామని చెప్పారు. ఈ ఫొటోలు విడుదలైతే కొందరి ముఖాలు వాడిపోతాయని పరోక్షంగా పన్నీర్‌సెల్వంను ఎద్దేవా చేశారు. జయకు చికిత్స సమయంలో పక్కనే ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.
స్నేహితురాలిగా, తల్లిగా 33 ఏళ్లపాటు జయలలిత వెన్నటి ఉండి శశికళ ఎంతో త్యాగం చేశారని ఆయన అన్నారు. శశికళ త్యాగాలను మరిస్తే పార్టీలో ఉండలేమని చెప్పారు. జయ మరణంతో తల్లిలేని బిడ్డల్లా మారిన అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకుని పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. శశికళ లేకుంటే ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గేదా అని ఆయన ప్రశ్నించారు. మనిషి జన్మనెత్తిన వారికి కృతజ్ఞత ఉండాలి, అది లేనివారితో దిగులు లేదని పన్నీర్‌సెల్వంపై పరుషపదజాలం ప్రయోగించారు.
జయ మరణం మర్మమే: పన్నీర్ సెల్వం
ఇదిలా ఉండగా, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తూత్తుకూడిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జయకు జరుగుతున్న చికిత్సను ముఖ్యమంత్రిగా తాను తరచూ సమీక్షించేవాడినని, ఈ 74 రోజుల్లో ఒక్కసారి కూడా జయను చూసేందుకు అవకాశం లేని పరిస్థితులను సృష్టించారని అయన ఆరోపించారు. వైద్యుల బృందం విడుదల చేసే బులిటెన్లలోని సారాంశాన్ని పార్టీ అధికార ప్రతినిధులు అలాగే వెల్లడి చే సేవారని, తాము సైతం నమ్మామని తెలిపారు. అయితే జయ మరణంలో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయని, వీటిని ప్రజల్లో నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జయ ఫొటోల విడుదల వల్ల మరణంపై సీబీఐ విచారణ జరపాలన్న తమ డిమాండ్‌లో మార్పు ఉండదు, ఎలాంటి బెంగలేదని ఆయన స్పష్టం చేశారు.