ముంబై ఇంటికి...
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. చాంపియన్స్ లీగ్ టి20 ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పొలార్డ్ బృందం ఓ మోస్తరు స్కోరుకు పరిమితమై ఓటమిని కొని తెచ్చుకుంది. ఫలితంగా ఆఖరి మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ చేతిలో చిత్తుగా ఓడి క్వాలిఫయింగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు నార్తర్న్, లాహోర్ లయన్స్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాయి.
రాయ్‌పూర్: రెండుసార్లు ట్రోఫీ గెలిచిన అనుభవం... డిఫెండింగ్ చాంపియన్ హోదా... కానీ కీలక మ్యాచ్ లో ఒత్తిడిని జయించలేకపోయిన ముంబై ఇండియన్స్ చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో నిరాశపర్చింది. ఓ మోస్తరు ప్రదర్శన కూడా చేయలేక అన్ని రంగాల్లో విఫలమై ఇంటిదారి పట్టింది. ఫలితంగా మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... నార్తర్న్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్), గోపాల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), మలింగ (8 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా... మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. ఆరంభం నుంచీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నార్తర్న్ బౌలర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌కు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేశారు. నాలుగో ఓవర్లో మైక్ హస్సీ (7) అవుట్ కావడం, పించ్ హిట్టర్‌గా వచ్చిన జలజ్ సక్సేనా (10)తో పాటు సిమ్మన్స్ (13), రాయుడు (6), తారే (7)లు వరుస విరామాల్లో వెనుదిరగడంతో ముంబై సగం జట్టు 46 పరుగులకే పెవిలియన్‌కు చేరుకుంది. ఈ దశలో కెప్టెన్ పొలార్డ్, హర్భజన్ (10)తో కలిసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించి 10 బంతుల వ్యవధిలో అవుటయ్యారు. చివర్లో గోపాల్, మలింగ బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయారు. దీంతో ఆఖరి మూడు ఓవర్లలో 43 పరుగులు రావడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. స్టైరిస్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసి నెగ్గింది. విలియమ్సన్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. డివిచ్ (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి విజయానికి కావల్సిన పునాది వేశారు. మధ్యలో ముంబై బౌలర్లు స్వల్ప వ్యవధిలో విలియమ్సన్, వాట్లింగ్ (0), ఫ్లిన్ (13)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో మిచెల్ (13 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మలింగ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. స్టైరిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) స్టైరిస్ 13; మైక్ హస్సీ (సి) కుగ్గెలిన్ (బి) సౌతీ 7; జలజ్ (సి) విలియమ్సన్ (బి) స్టైరిస్ 10; రాయుడు (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 6; తారే (సి) వాట్లింగ్ (బి) స్టైరిస్ 7; పొలార్డ్ (సి) హారిస్ (బి) సౌతీ 31; హర్భజన్ (సి) డివిచ్ (బి) కుగ్గెలిన్ 10; గోపాల్ రనౌట్ 24; మలింగ (బి) సౌతీ 20; ఓజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 132
వికెట్ల పతనం: 1-10; 2-27; 3-34; 4-44; 5-46; 6-75; 7-89; 8- 116; 9-132
బౌలింగ్: బౌల్ట్ 4-0-21-1; సౌతీ 4-0-24-3; కుగ్గెలిన్ 4-0-40-1; స్టైరిస్ 4-0-21-3; ఇష్ సోధి 4-0-25-0.
నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఇన్నింగ్స్: డివిచ్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 39; విలియమ్సన్ (సి) పొలార్డ్ (బి) బుమ్రా 53; ఫ్లిన్ (సి) హర్భజన్ (బి) ఓజా 13; వాట్లింగ్ (సి) హర్భజన్ (బి) బుమ్రా 0; మిచెల్ నాటౌట్ 16; స్టైరిస్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (17.2 ఓవర్లలో 4 వికెట్లకు) 133
వికెట్ల పతనం: 1-83; 2-103; 3-113; 4-115
బౌలింగ్: మలింగ 4-0-31-0; బుమ్రా 4-0-26-2; హర్భజన్ 4-0-29-1; ప్రజ్ఞాన్ ఓజా 3.2-0-23-1; జలజ్ సక్సేనా 2-0-21-0.