ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 20వ వర్ధంతి పురస్కరించుకుని సోమవారం ఆయనకు ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబీకులు, తెలుగుదేశం పార్టీ నేతలు వేర్వేరుగా వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఉండడంతో ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. ఎన్టీఆర్ కుమారులు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రామకృష్ణ, మాజీ ఎంపీ హరికృష్ణ ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి వేర్వేరుగా వచ్చి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిలు కూడా సమాధి వద్ద నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్. రమణ, మాగంటి గోపీనాథ్, సాయిబాబ, కోటేశ్వర్రావు, ప్రదీప్ చౌదరి తదితరులు కూడా సమాధి వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ, బాలకృష్ణలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు. కాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్‌లో ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదని పార్టీ నేతలు, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.