బిగ్ బీ చుట్టూ బిగుస్తున్న పనామా ఉచ్చు
న్యూఢిల్లీ: పనామా పేపర్స్ వ్యవహారంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. జాతీయ మీడియా తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం అమితాబ్ బచ్చన్ మరిన్ని సమస్యల్లో చిక్కుకున్నారు. పనామా పత్రాల తాజా జాబితా ప్రకారం ఆయన నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. 1993 -97 మధ్య కాలంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన బిగ్ బీ ఆయా కంపెనీల్లో కీలక పాత్ర పోషించారంటూ మరిన్ని ఆధారాలను బయటపెట్టింది.
ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు సమావేశాల్లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నట్లు తెలిపింది.1994లో ఆయా కంపెనీలతో అమితాబ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొంది. దీంతోపాటు రెండు కంపెనీలు జారీ చేసిన సర్టిఫికెట్లో డైరెక్టర్ల జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉందని వెల్లడించింది. ఆ రెండు కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆఫీస్ బేరర్ పేర్లలో అమితాబ్ పేరును అధికారికంగా పేర్కొన్నారని చెప్పింది.
మరోవైపు మొదట వచ్చిన ఆరోపణలను ఖండించిన బిగ్ బి తాజా పత్రాల్లో తన పేరు వెల్లడైన అంశంపై స్పందించారు. ఆఫ్షోర్ బోర్డు సమావేశాల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలకు అమితాబ్ సమాధానం ఇచ్చారు. పది రోజుల క్రితమే ఆ అంశంపై ప్రభుత్వం తనకు నోటీసు ఇచ్చిందని, ప్రభుత్వం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఒకవేళ ప్రభుత్వం ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకుంటే తాను సహకరించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్న 500 మంది భారత నల్లకుబేరుల జాబితాలో అమితాబ్ పేరు ప్రముఖంగా నిలిచింది. 1993 నుంచి 1997 వరకు ఆర్బీఐ నియమావళికి వ్యతిరేకంగా అమితాబ్ విదేశాల్లో సొమ్మ దాచుకున్నట్లు గతంలో పనామా పత్రాల ద్వారా వెల్లడైన విషయం తెలిసిందే.