ఆ యాప్‌కు వంద కోట్ల డౌన్లోడ్లు!!
స్మార్ట్‌ఫోన్ గానీ, టాబ్లెట్ పీసీ గానీ ఉన్నాయంటే చాలు.. అందులో తప్పనిసరిగా ఉండి తీరాల్సిన యాప్.. టెంపుల్ రన్. పిల్లలు, పెద్దవాళ్లు, ఆడ, మగ.. ఎలాంటి తేడా లేకుండా విపరీతంగా ఆడుతున్న ఆట ఈ టెంపుల్ రన్. అందుకే, దీని డౌన్లోడ్లు ఏకంగా వందకోట్లు దాటేశాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఏకైక యాప్..టెంపుల్ రన్ మాత్రమే. టెంపుల్ రన్, టెంపుల్ రన్ 2.. ఈ రెండూ కలిసి మొత్తం వంద కోట్ల డౌన్లోడ్లు దాటాయి. ఇందులో ఉన్న మిగిలిన వెర్షన్లను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 2008 సంవత్సరంలో కీత్ షెఫర్డ్, నటాలియా లకియనోవా అనే భార్యాభర్తలు కలిసి స్థాపించిన ఇమాంజి స్టూడియోస్ అనే సంస్థ 2011 సంవత్సరంలో టెంపుల్ రన్ యాప్‌ను విడుదల చేసింది.
తాము ముందు దీన్ని ప్రారంభించినప్పుడు వంద కోట్ల డౌన్లోడ్లు అవుతాయని పొరపాటున కూడా ఊహించలేదని కీత్ షెఫర్డ్ చెప్పారు. టెంపుల్ రన్ ఆడుతున్న ప్రతి ఒక్కళ్లకు, తమ టీమ్ సభ్యులకు అందరికీ చాలా కృతజ్ఞులై ఉంటామని, దీన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు, మరిన్ని సృజనాత్మక గేమ్స్ రూపొందిస్తామని తెలిపారు. ఈ యాప్‌ను అత్యధికంగా చైనాలో 36 శాతం మంది డౌన్లోడ్ చేసుకుంటే, అమెరికాలో 21 శాతం మందే చేసుకున్నారు. ఈ ఆట ఆడేవాళ్లలో 60 శాతం మంది ఆడాళ్లేనని కూడా కంపెనీ తెలిపింది. ఆట ఆడేవాళ్లంతా కలిసి సంయుక్తంగా 2,16,018 సంవత్సరాల సమయం గడిపారని, 3200 కోట్ల ఆటలు ఆడారని, టెంపుల్ రన్ ప్లేయర్లంతా కలిసి ఇప్పటికి 50 ట్రిలియన్ల మీటర్లు పరిగెత్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.