ఉభయసభలకూ ఆర్డినెన్సు సెగ
* పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఆందోళన
* సభ సజావుగా సాగకపోవడంతో వాయిదా వేసిన స్పీకర్
* అటు రాజ్యసభ కూడా వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్డినెన్సు సెగ కొత్తగా కొలువుదీరిన 16వ లోక్‌సభకూ తాకింది. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ సభ్యులు సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు కడియం శ్రీహరి, వినోద్‌కుమార్, కవిత, జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్, నర్సయ్యగౌడ్ సహా ఆ పార్టీకి చెందిన మిగిలిన సభ్యులు, వైఎస్సార్సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లకార్డులతో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలిచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో తాము చేసిన ప్రతిపాదనలపై చర్చకు పట్టుపట్టాలని బీజేడీ సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలిచ్చారు.
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కోసం అంశాన్ని లోక్‌సభ టేబుల్‌పై పెట్టారు. అనంతరం జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ (తెలంగాణ), మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ (మహబూబాబాద్) పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేశారు.
సభ కొనసాగుతుండగా ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒడిశాలో గిరిజన గ్రామాలు కనుమరుగు కానున్నాయని మరోవైపు బీజేడీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో తాము చేసిన ప్రతిపాదనలపై చర్చకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
సభ్యులకు సర్దిచెప్పడానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు విజ్ఞప్తులు చేసినా వారు పట్టించుకోలేదు. ఆర్డినెన్సుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు అనుమతి ఇస్తానని స్పీకర్ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ నిరసనలు
రాజ్యసభలో ఆర్డినెన్సు అంశం ఆందోళనకు తెరలేపింది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం 12.30 గంటలకు సభ్యుల ప్రమాణంతో సభ మొదలైంది. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు (ఆంధ్రప్రదేశ్), టి.సుబ్బరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్), గరికపాటి మోహన్‌రావు (తెలంగాణ), దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), బీహార్, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం నుంచి ఎన్నికైన సభ్యులతో చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. అనంతరం దివంగత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే, సభ్యులు నేదురుమల్లి జనార్దనరెడ్డి, బంగారు లక్ష్మణ్, భువనేశ్ చతుర్వేది, కుశ్వంత్ సింగ్, స్కాటో స్వేయు, అధిక్ శిరోద్కర్ , ఆర్ఎన్ ఆర్య మృతికి సభ శ్రద్ధాంజలి అర్పించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్, టి.టీడీపీ ఎంపీల నిరసన మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది.
రాజ్యసభ బీజేపీ పక్ష నేతగా జైట్లీ, విపక్ష నేతగా గులాంనబీ ఆజాద్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 2వ తేదీన ఈ విషయం తనకు తెలియపర్చారని అన్సారీ సభకు తెలిపారు. మొన్నటివరకు జైట్లీ రాజ్యసభ విపక్ష నేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో విపక్ష నేతగా గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్) ఉంటారు.
లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా కొనకళ్ల నారాయణ
టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. ప్యానెల్ స్పీకర్లో మొత్తం పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కొనకళ్ల నారాయణతో పాటు అర్జున్ చరణ్ సేఠి, తంబిదొరై, హకుందేవ్ నారాయణ యాదవ్, కె.వి.థామస్, ఆనందరావు అడసూల్, ప్రహ్లాద్ జోషీ, రత్నాడే, రమెన్డెకా, హుకుం సింగ్‌లు ప్యానెల్ స్పీకర్‌గా నామినేట్ అయ్యారు.