రియల్ హీరోలా రాజకీయాలు చేయండి
పవన్ కల్యాణ్‌కు బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడి సూచన
భ్రమల్లోంచి బయటకు రావాలని హితవు
సూళ్లూరుపేట: ‘అయ్యా.. పవన్ కల్యాణ్‌గారూ, రాజకీయాలంటే సినిమాల్లో డూప్ చేసినట్టుగా కాదండీ.. రాజకీయాల్లో సైడ్ యాక్టర్లా పనిచేస్తే కుదరదు. ముందు మీరు సినిమాలను సైడ్ యాక్టింగ్‌లా మార్చుకుని రాజకీయాలను రియల్ హీరోలా చేస్తే స్వాగతిస్తాం. మీ వల్ల కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనే భ్రమల్లో నుంచి బయటకు వచ్చేయండి.’ అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి హితవు పలికారు. తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వెంకటస్వామి ఐదో వర్ధంతి సభకు సూళ్లూరుపేటకు వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మాట మాటకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని పవన్‌కల్యాణ్ విమర్శించడం తగదన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్డీఏకు సహకరిస్తానని ముందుకొస్తే స్వాగతించామే తప్ప ఆయన వల్లే అధికారంలోకి రాలేదన్నారు. ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయం కాబట్టి దానిని పట్టుకుని వేలాడటం అవివేకమన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దీన్ని తెరమీదకు తెచ్చారన్నారు. దీనికి పవన్ కల్యాణ్ వంత పాడడం అవివేకానికి నిదర్శమన్నారు. ప్రత్యేకహోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో వున్న పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వేలకోట్లు నిధులిచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఇదంతా పవన్‌కు తెలియదా అని సురేంద్రరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు ఎంతో చేశారని.. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు ఏం చేశారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ దయాకర్‌రెడ్డి, జిల్లా గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు గిరిగౌడ్ పాల్గొన్నారు.