నకిలీబిల్లులతో దర్జాగా..
తవ్వినా కొద్దీ..
నల్లా బిల్లుల డబ్బు కాజేసిన వైనం
ఇంటింటి సర్వేలో వెలుగులోకి
ఎలక్ట్రీషియన్ లీలలు చూసి
విస్తూపోయిన అధికారులు
అతడు పేరుకే పార్ట్‌టైం ఉద్యోగి.. అంతా గుత్తాధిపత్యమే.. ఆ పంచాయతీలో కార్యదర్శి ఇచ్చిన అలుసును ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకున్నాడు.. కేవలం ఇంటిపన్నులకే పరిమితమనుకున్న అతడి అవినీతి లీలలు నల్లా బిల్లుల వసూళ్లలో కూడా ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. నకిలీ బిల్లులు సృష్టించి నల్లా బిల్లుల పేరిట డబ్బులు వసూలు చేసి కాజేశాడని అధికారుల సర్వేలో బయటపడింది.
పలివెల(మునుగోడు)
పలివెల గ్రామ పంచాయతీ పార్ట్‌టైం ఎలక్ట్రీషన్ భిక్షంరెడ్డి ఇంటి పన్నుల వసూలులో చేసిన గోల్మాల్ను నిగ్గు తేల్చేందుకు మండలంలోని 10 మంది కార్యదర్శులు బృందం సోమవారం ఆ గ్రామానికి వెళ్లి ఇంటింటి సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో అతడి గోల్మాల్ పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతడు ఇంటి పన్నులతో పాటు నల్లా ప న్ను డబ్బులు కూడా స్వాహా చేసినట్టు తేలింది.
నకలీ బిల్లులు సృష్టించి..
2012 నుంచి ఇప్పటి వరకు అతను నకలీ నల్లా బుక్కులతో పన్నులు వసూలు చేశాడు. కార్యదర్శులు ఇంటి ఇంటికీ వెళ్లి వారి వద్ద ఉన్న రశీదులను చూస్తే డబ్బులు చెల్లించినట్టు ఉన్నాయి. కానీ అందుకు సంబంధించిన జీరాక్స్ బుక్స్ మాత్రం పంచాయతీ కార్యాలయంలో లేవు. దీంతో అవి నకిలీ బుక్స్‌గా కార్యదర్శులు గుర్తిం చారు. ఇలా వారు సర్వే చేపట్టిన ఇళ్లలో దాదపు సగానికి పైగా నకలీ రశీదులు ఉన్నట్టు తేలాయి.
300 ఇళ్లకే రూ.45వేలు..
ఆ గ్రామంలో 687 ఇళ్లు ఉన్నాయి. మొదటి రోజున కార్యదర్శుల బృందం దాదాపు 300 ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించింది. అయితే ఆ ఇంటి యజమానుల వద్ద ఉన్న రశీదులను పరి శీలించగా అందులో *45వేల 976 రూపాయలను ఎలక్ట్రీషన్ గోల్మాల్ చేసినట్లు గుర్తించా రు. మిగతా 387 ఇళ్లలో సర్వే చేస్తే మరో *లక్ష వరకు అతను కాజేసి ఉంటాడని అనూమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి అతను ఎంత మింగేశాడనే తేల్చి సంబంధిత లిస్టును గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డుకు అంటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.