రోడ్లకు మహర్దశ
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా 1,390 కిలోమీటర్ల మేర ఉన్న పంచాయతీ రాజ్ పాత రోడ్లకు మరమ్మతు చేయించేందుకు రూ.252.76 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీవో 20ని పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,006 కిలో మీటర్ల మేర ఉన్న రహదారులను బాగు చేసేందుకు రూ.1,766.92 కోట్లు మంజూరు కాగా, జిల్లాకు రూ.252.76 కోట్లు వచ్చాయి. ఇందులో రూ.6.02 కోట్లు సీడీ మరమ్మతు పనులకు మంజూరయ్యాయి.
జిల్లాలో అత్యధికంగా నిర్మల్ నియోజకవర్గంలో 48 రోడ్లకు నిధులు మంజూరు కాగా, నిధుల పరంగా చూస్తే బోథ్ నియోజకవర్గానికి రూ.51.38 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 1న అన్ని జిల్లాల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంచాయతీరాజ్ రోడ్ల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని పలువురు ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోడ్ల కోసం భారీ స్థాయి లో నిధులు మంజూరు కావడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పంచాయతీరాజ్ పరిధిలో జిల్లాలో 7,256 కిలో మీటర్ల మేరకు రహదారులున్నాయి. ఇందులో సుమారు 1,900 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్లు ఉన్నాయి. మిగితావి మెటల్, ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయి. ఈ 1,900 కిలో మీటర్ల పొడువు ఉన్న రహదారుల్లో 2009 కంటే ముందు (ఐదేళ్ల కిత్రం) వేసిన రోడ్లను మరమ్మతు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అనేక రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఈ రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టాలని నిర్ణయించింది.
మండలాల వారీగా ప్యాకేజీలు..
ఈ రహదారుల మరమ్మతుకు నిధులు మంజూ రు చేసిన సర్కారు టెండర్ల ప్రక్రియకు కూడా శ్రీ కారం చుట్టింది. హైదరాబాద్‌లోని చీఫ్ ఇంజినీ ర్ కార్యాలయం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే.. ఒక్కో మండలంలోని రోడ్లను ఒక ప్యా కేజీగా ఏర్పాటు చేసి టెండర్లు పిలుస్తున్నారు. గతంలోనే పంచాయతీరాజ్ అధికారులు ఆయా రోడ్లను మండలాల వారీగా విభజించి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.