ప్రాణం తీసిన పారాసిటమాల్!
లండన్: పారాసిటమాల్ మాత్రలు ప్రాణాంతకమని వైద్యులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ యువతి గత మార్చిలో అనారోగ్యంతో మరణించడానికి కారణం పారాసిటమాల్ మాత్రలేనని తాజా విచారణలో వెల్లడైంది. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హడర్స్ ఫీల్డ్‌కు చెందిన జార్జియా లిటిల్‌వుడ్ (17) అనే యువతి అధిక మొత్తంలో పారాసిటమాల్ టాబ్లెట్లు మింగడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లి శ్రీమతి లిటిల్ వుడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జార్జిలిటిల్ వుడ్ స్థానికంగా ఓ సెలూన్లో పనిచేసేది. ఈ ఏడాది మార్చి 28న ఉదయం తలనొప్పిగా ఉండటంతో తల్లి ఇబ్రూప్రూఫెన్ మాత్రలు ఇచ్చింది. సెలూన్‌కు వెళ్లగా జార్జియాకు కడుపులోనొప్పిగా ఉందని పారాసిటమాల్ మాత్రలు వేసుకుంది.
సెలూన్ నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి 2 గంటలకు తీవ్రంగా వాంతులు చేసుకుంటున్న జార్జియాను బాయ్‌ఫ్రెండ్ ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం ప్రారంభించిన డాక్టర్లతో తాను పారాసిటమాల్ టాబ్లెట్లు తీసుకున్నట్లు జార్జియా తెలిపింది. వైద్యపరీక్షల్లో జార్జియా లివర్ ఫెయిల్ అయిందని గుర్తించారు. వెంటనే లివర్ మార్చాలని నిర్ణయించారు. కానీ, పరిస్థితి విషమించడంతో మార్చి 30న జార్జియా కన్నుమూసింది. దీంతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా పారాసిటమాల్ వాడవద్దని సదరు యువతి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.