పారిస్‌లో సామూహిక సమాధులు
పర్యాటకుల కలల ప్రపంచమైనా పారిస్‌లో ఓ సూపర్ మార్కెట్‌ను పునరుద్ధరించేందుకు బేస్మెంట్ను తవ్వుతుండగా ఇటీవల సామూహిక సమాధులు బయటపడ్డాయి. 200 మానవ కళేబరాలు బయటపడ్డాయి. తల నుంచి కాళ్ల వరకు ఒకరి పక్కన ఒకరిని వరుసగా నిట్టనిలువుగా నిలబెట్టిన ఈ మృతదేహాల అవశేషాలు ఎనాటివో కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. వారు ఎలా చనిపోయారన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. అవి ఏనాటివో తెలిస్తే గానీ కారణాలను అంచనా వేయలేం.
సూపర్ మార్కెట్ భవనం పునాదుల కింద ఏడు సామూహిక సమాధులు బయటపడ్డాయి. గదుల్లా ఉన్న ఈ సమాధుల్లో అతి పెద్ద దాంట్లో 150 మృతదేహాలు కళేబరాలు, మిగతావాటిలో 5 - 20 మృతదేహాలు బయటపడ్డాయి. ప్రస్తుతం సూపర్‌మార్కెట్ ఉన్న స్థలంలో ఒకప్పుడు ట్రినిటీ ఆస్పత్రి ఉండేది. 1202 లోనే పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లో ప్లేగులాంటి మహమ్మారీల వల్ల రోజుకు ఆస్పత్రిలో వంద మందికి పైగా మరిణించేవారట. అందుకని ఆస్పత్రి పక్కనే ఓ శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేశారట. కిక్కిరిసిన నగరంలో మృతదేహాలను ఖనననం చేయడానికి చోటు దొరక్క నగర ప్రజలు కూడా తమ వారిని ఈ శ్మశానంలోనే ఖననం చేశారట. అయితే ఇప్పుడు బయటపడిన మృతదేహాల అవశేషాలపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో దేహాలపై ఎలాంటి గాయాలు గానీ, జబ్బుపడిన లక్షణాలు గానీ కనిపించకపోవడం కొంత ఆశ్చర్యమేనని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. 'కార్బన్ రేడియో ఆక్టివ్ ఐసోటోప్స్'ను ఉపయోగించి ఆ మృతదేహాలు ఏకాలం నాటివో కనుక్కుంటామని వారు చెబుతున్నారు.