partho banerjee
-
‘ఎస్-క్రాస్’ ధర తగ్గించిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన ‘ఎస్-క్రాస్’ కారు దరను రూ.40,000-రూ.2,05,000 శ్రేణిలో తగ్గించింది. కంపెనీ ఎస్-క్రాస్ మోడల్‌ను 1.6 లీటర్, 1.3 లీటర్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో గతేడాది ఆగస్ట్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అధిక ధరల కారణంగా ఈ కారు విక్రయాలు ఆశించినంత స్థాయిలో లేవు. దీంతో కంపెనీ తాజాగా కారు ధరలను తగ్గించింది. కంపెనీ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. 1.6 లీటర్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.2,05,000, 1.3 లీటర్ వేరియంట్ ధర రూ.40,000-రూ.66,000 శ్రేణిలో తగ్గింది. ఎస్-క్రాస్ ధరను సవరించామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్.కల్సి తెలిపారు. ఎస్-క్రాస్ విక్రయాలు ఆరు నెలల్లో 17,000 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ సీనియన్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ చెప్పారు. -
మారుతీ సియాజ్ ఇదిగో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ సియాజ్‌ను దేశవ్యాప్తంగా సోమవారం విడుదల చేసింది. డీజిల్, పెట్రోల్ వర్షన్లలో లభించే ఈ కారు ధర వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.7.34-10.2 లక్షల మధ్య ఉంది. ఏ3+ విభాగంలో అధిక పొడవు, వెడల్పు ఉన్న మోడల్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, విశాలమైన లెగ్ రూమ్, భద్రత కోసం సుజుకీ టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీని వాడారు. మైలేజీ డీజిల్ వేరియంట్ 26.21, పెట్రోల్ అయితే 20.73 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. సియాజ్ అభివృద్ధికి రూ.620 కోట్లు ఖర్చు చేశారు. వెయిటింగ్ పీరియడ్ 8-10 వారాలు ఉంది. 15 లక్షల కస్టమర్లు.. స్విఫ్ట్, డిజైర్ కస్టమర్లు 15 లక్షల మంది వరకు అప్‌గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్నారని మారుతి సుజుకి డీలర్ డెవలప్మెంట్, సేల్స్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్థో బెనర్జీ సోమవారమిక్కడ తెలిపారు. సియాజ్ విడుదల కార్యక్రమంలో కంపెనీ ప్రాంతీయ మేనేజర్ మునీష్ బాలితో కలిసి మీడియాతో మాట్లాడారు. పాత కస్టమర్ల ఆశలను సియాజ్ తీరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా సియాజ్ బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి ఈ సంఖ్య 800పైగా ఉంది. ఎస్ఎక్స్4 మోడల్ ఉత్పత్తి నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. ఆరేడేళ్ల తర్వాతే: కొద్ది కాలం క్రితం వరకు కస్టమర్లు నాలుగైదేళ్లకోసారి కారును మార్చేవారు. ఇప్పుడు ఆరేడేళ్లు అట్టిపెట్టుకుంటున్నారని పార్థో బెనర్జీ తెలిపారు. ఎకానమీ ఇంకా వృద్ధిబాటన పట్టలేదు. సెంటిమెంటూ బలహీనంగా ఉంది. కార్ల పరిశ్రమ మందగమనానికి కారణమిదే అని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గితే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. ఎంక్వైరీలు పెరుగుతున్నందున పండుగల సీజన్లో అమ్మకాల జోష్ ఉంటుందని పేర్కొన్నారు. 2014-15 తొలి అర్ధ భాగంలో కంపెనీ 15 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో అర్ధభాగంలోనూ అంతే వృద్ధిని ఆశిస్తోంది. నెలకు 10 కార్ల విక్రయాలు నమోదయ్యే అవకాశమున్న చిన్న పట్టణాల్లో కంపెనీ షోరూంలను తెరుస్తోంది.