పరిశ్రమలు కుదేల్: ఇం‘డల్’స్ట్రియల్
పటాన్చెరులో ఉన్న ఓ పరిశ్రమ బయోమాస్క్ బ్రికెట్ (బొగ్గుకు ప్రత్యామ్నాయం) తయారు చేసి టైల్స్ ఉత్పత్తి చేసే ఓ భారీ పరిశ్రమ (కొత్తూరు)కు సరఫరా చేస్తోంది. ఈ టైల్స్ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి రవాణా అవుతాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో టైల్స్ పరిశ్రమకు ఆర్డర్లు తగ్గాయి. దీంతో ఈ టైల్స్ పరిశ్రమ పటాన్చెరులోని బ్రికెట్ల ఆర్డర్లను తగ్గించింది. చేసేదేమీ లేక పటాన్చెరులోని బ్రికెట్ పరిశ్రమ ఉత్పత్తిని దాదాపు సగానికి తగ్గించింది. ఈ పరిశ్రమలో పనిచేసే సుమారు 200 మందిలో 80 నుంచి 100 మంది కారి్మకులకు పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితి ఒక్క పటాన్చెరులోని బయోమాస్క్ బ్రికెట్ ఫ్యాక్టరీదే కాదు.. జిల్లాలోని పాశమైలారం, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి, హత్నూర, సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మా సంబంధిత కేటగిరీలకు చెందిన పరిశ్రమలను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమలపైనా లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సరైన ఆర్డర్లు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. పారిశ్రామిక ప్రగతి చక్రం ఆగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు అన్ని రకాల పరిశ్రమల కార్యకలాపాలను లాక్డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇచి్చంది. మాస్క్లు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూనే ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలపై ఉన్న లాక్డౌన్తో పాటు, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం పారిశ్రామిక రంగంలోని కార్మికులపై పడుతోంది.
కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి దెబ్బ
లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడంతో కారి్మకుల ఉపాధిపై దెబ్బ పడుతోంది. అనేక పరిశ్రమలు కాంట్రాక్ట్ కారి్మకులు, రోజువారీ వేతనాలపై పనిచేసే కారి్మకులకు పని ఇవ్వడం లేదు. కేవలం పరి్మనెంట్ కారి్మకులకు మాత్రమే పని కల్పిస్తున్నాయని కారి్మక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పరి్మనెంట్ కారి్మకుల్లో కూడా కొందరిని సెలవులపై వెళ్లాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రోజువారీ వేతనాలు, కాంట్రాక్ట్ కారి్మకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్కండ్ వంటి రాష్ట్రాల నుంచి వచి్చన వలస కూలీలు చాలామంది నెల రోజుల క్రితం నుంచి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక కారి్మకులు పని దొరక్క, చేతిలో చిల్లిగవ్వ లేక పడరాని పాట్లు పడుతున్నారు.
ఫార్మా పరిశ్రమల్లో నిరాటంకంగా ఉత్పత్తి
కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రకాల మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్–19కు చికిత్స అందించే మందుల కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి నిరాటంకంగా కొసాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు మూడు షిఫ్టులతో పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా కరోనా సోకుతుండటంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కారి్మకులను ఆదుకోవాలి
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిత్యావసరాలతో పాటు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కరోనా బారిన పడిన కారి్మకులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు ఇంట్లో ఉండలేని బాధితులకు హోం ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి.
- కొల్కూరి నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు
ఆర్డర్లు తగ్గాయి..
లాక్డౌన్ నిబంధనలతో పరిశ్రమల్లో ఉత్పత్తిని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఆయా రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా నిర్మాణ, ఆటోమొబైల్ వంటి రంగాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. దీంతో సంబంధిత పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోంది.
- కాల రమేశ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్