అన్నంగిలో విషాదం
పరవళ్లు తొక్కుతున్న గుండ్లకమ్మ..
మనువడిని అమాంతం మింగింది
సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహం..
తాతను క్షణాల్లో మాయం చేసింది
ఎప్పుడూ కలిసి ఉండే తాతామనవళ్లు..
ఇప్పుడు వేరై మళ్లీ ఒక్కటయ్యారా?
మద్దిపాడు : చేపల వేటకు వెళ్లి తాతామనువడు గల్లంతయ్యారు. కొద్దిసేపటికి మనువడు మృతి చెందగా తాత ఆచూకీ తెలియ రాలేదు. ఈ సంఘటన మండలంలోని ఆన్నంగి వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అన్నంగికి చెందిన కుంచాల పెద్ద గోవిందు(65) చేపల వేట కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు తన కుమారుడు కొడుకు (మనుమవడు)తో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో యథావిధిగా పెద్ద గోవిందు చేపల వేటకు బయల్దేరుతుండగా తానూ వస్తానంటూ మనువడు లక్ష్మయ్య పట్టుబట్టాడు.
సముదాయించినా మనువడు పట్టువీడలేదు. చేసేదిలేక తనతో పాటు లక్ష్మయ్యను పెద్ద గోవిందు వేటకు తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామంలోని ఇతర మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి ఇంటి ముఖం పట్టారు. గోవిందు తన మనువడితో కలిసి వడివడిగా వేటకు బయల్దేరాడు. వేట అనంరతరం తిరగు ప్రయాణంలో ఉండగా తాతామనువడు ప్రయాణిస్తున్న తెప్ప (థర్మాకోల్ షీట్లతో చేసింది) తిరగబడటంతో తాత ఒకచోట మనువడు మరో చోట నీటిలో పడిపోయారు. ఎంతకీ వారు ఇంటి కి రాకపోవడంతో లక్ష్మయ్య తల్లి ఆదిలక్ష్మి విషయాన్ని తన భర్త అంకమ్మరావుతో చెప్పింది. అంకమ్మరావు చుట్టుపక్కల వారితో కలిసి రిజర్వాయర్ వద్దకు వె ళ్లగా తెప్ప కనిపించింది.
స్థానిక మత్స్యకారులు నీటిలోకి దిగి వెతకగా లక్ష్మయ్య (11)వలలో అపస్మారక స్థితిలో కనిపిం చాడు. వెంటనే బాలుడిని ఒడ్డుకు చేర్చి దగ్గరలోని మేదరమెట్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామం అన్నంగి తరలించారు. పెద్ద గోవిం దు ఆచూకీ కోసం సహచర మత్స్యకారులు గాలిస్తూనే ఉన్నారు. తహశీల్దార్ కేఎల్ నరసింహారావు, ఎస్సై మహేష్‌లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
నా భర్త ఆచూకీ చెప్పండయ్యా..
గ్రామంలో వడియరాజులపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. రోజూ కలిసి తిరిగే తాతా మనువళ్లను గుర్తుకు తెచ్చుకుని బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కుమారుడు మృతి చెందడం.. తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అంకమ్మరావు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. లక్ష్మయ్య 5వ తరగతి చదువుతున్నాడు. పెద్ద గోవిందు భార్య ఏసు తీరని దుఖంతో కనిపించిన ప్రతివారిని పట్టుకుని మా ఆయన ఏడయ్యా.. అంటూ విలపిస్తోంది. కుమారుడిని పోగొట్టుకుని అంకమ్మరావు భార్య ఆదిలక్ష్మి విలపిస్తున్న తీరు స్థానికులను కలచి వేసింది.