ఘనంగా గూటుపల్లె ఉరుసు
భక్తిశ్రద్ధలతో పెద్దరాజు స్వామికి గంధం సమర్పణ
-వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు
- ఆకట్టుకున్న ఫక్కిర్ల సాహస కృత్యాలు
గూటుపల్లె (బేతంచెర్ల) : మండల పరిధిలోని గూటుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్‌షా అబ్దుల్ రహమాన్ ఇద్రూస్‌బాష (పెద్దరాజు స్వామి) ఉరుసు ఘనంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తజనం మధ్య గ్రామ పురవీధుల గుండా గంధం ఊరేగింపు నిర్వహించారు. దర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్‌బాష ఖాద్రి , ఉప పీఠాధిపతి ఇద్రూస్‌బాష ఖాద్రి ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.
గగ్గురుపొడిచిన సాహస కృత్యాలు
ఉరుసు సందర్భంగా గోవా, ముంబాయి, మహారాష్ట్ర , కర్ణాటక, బెల్గం, బీజాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫక్కిర్లు చేసిన సాహస కృత్యాలు ఔరా అనిపించాయి. ఇనుపచువ్వలు, కడ్డీలను గొంతు, నాలుక, ముఖం, తలపై పొడుచుకునే దృశ్యాలు గగ్గురుపొడిచాయి. కోవెలకుంట్లకు చెందిన ఇనాం దారులు నాట్యం చేసి పలువురి మన్ననలు అందుకున్నారు. బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం , ఎస్ఐ తిరుపాలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.