ప్రజాసమస్యలపై పోరుబాట
అనంతపురం అర్బన్ : ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా చేపట్టాలన్నారు. 31న తహశీల్దారు కార్యాలయాల ఎదట ధర్నాలు నిర్వాహించాలన్నారు. ప్రజాందోళనలో ప్రజలను భాగస్వాములన్ని చేయాలని నాయకులకు సూచించారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో పార్టీ సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లు గడిచినా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, ఆ వర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సొంత ఇల్లు, పింఛను అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి లింగమయ్య, సహాయ కార్యదర్శి శ్రీరాములు, నాయకులు ఈశ్వరయ్య, రమణప్ప, బిందెల నారాయణస్వామి, మహిళ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, నగర కార్యదర్శి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.