రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రకటనపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ ఉన్నత ధర్మాసనంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. రెండో ఎస్సార్సీ ద్వారానే కొత్త రాష్ట్రాలు ఏర్పడాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అలాగే రాష్ట్ర విభజన అంశంపై శాసనసభలో విధిగా ఆమోదం పొందేలా చూడాలని అడుసుమిల్లి తన పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది పివి కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించి సుప్రీంకోర్టు సోమవారం నుంచి వాదనలు విననుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 అమలులో ఉన్నందువల్ల రాష్ట్ర విభజన సాధ్యం కాదని పిటిషనర్ వాదించారు.