ప్రధానుల కర్మభూమి ఫూల్పూర్
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన యూపీలో ఫూల్పూర్ లోక్‌సభ స్థానంలో గెలుపుని ఇటు బీజేపీ, అటు ఎస్పీబీఎస్పీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకసారి విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ స్థానాన్ని తిరిగి రాబట్టుకోవాలనుకుంటోంది. బీజేపీని తిరిగి అడుగుపెట్టనివ్వరాదన్న దృఢసంకల్పంతో మహాకూటమి పనిచేస్తోంది. మే 12న పోలింగ్ జరిగే ఫూల్పూర్కి జవహర్ లాల్ నెహ్రూ, వీపీ సింగ్, విజయలక్ష్మి పండిత్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1971లో వీపీ సింగ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున విజయాన్ని కైవసం చేసుకున్నారు. సోషలిస్టు పార్టీ నుంచి రామ్ మనోహర్ లోహియా 1962లో నెహ్రూపై పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు.
ప్రముఖులను గెలుపుతీరాలకు చేర్చిన స్థానం...
1952లో జరిగిన తొలి ఎన్నికలు మొదలుకొని 1957, 1962ల్లో మూడు సార్లు వరుసగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. జవహర్ లాల్ నెహ్రూ మరణించేవరకూ ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ ఇక్కడి నుంచి గెలుపుబావుటా ఎగురవేశారు. 2009లో బీఎస్పీ అభ్యర్థి కపిల్ మున్వీ కర్వారియా గెలుపొందారు.
వచ్చినట్టే వచ్చి చేజారిన బీజేపీ సీటు...
ఈ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్కసారి ఈ సీటుని గెలుచుకోగలిగింది. 2014లో తొలిసారి బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈస్థానాన్ని కైవసం చేసుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ కలిసికట్టుగా పోటీ చేసి బీజేపీని ఓడించాయి. 2014లో బీజేపీ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కి 60 వేల ఓట్ల మెజారిటీ రావడంతో బీజేపీ కంగుతినాల్సి వచ్చింది.
2019 ఎవరికి కలిసొస్తుంది?
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేసరి దేవి పటేల్ పోటీ చేస్తోంటే, ఎస్పీ పంధారీ యాదవ్‌ని బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున పంకజ్ నిరంజన్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా జాతీయవాదం, తీవ్రవాద వ్యతిరేక దాడులు బీజేపీ గెలుపునకు దోహదం చేస్తాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
కులం ప్రధానమే...
2018 ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో సైతం ఎస్పీ, బీఎస్పీ వ్యూహాత్మక కుల సమీకరణలు ఈసారి కూడా పనిచేస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఫూల్పూర్ నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామస్తుడు రామ్‌సింగ్ పటేల్ ‘‘ఇటీవల తీవ్రవాద స్థావరాలపై దాడులు తప్ప, నాకు ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయాల గురించి ఏమీ తెలియదు. కానీ నేను బీజేపీకే ఓటు వేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ మా కులం నాయకుడిని పోటీకి దింపింది’’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ స్థానంలో కులం ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ పటేల్ మామ కూర్మి నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అలాగే పంకజ్ పటేల్ అత్తయ్య కృష్ణ పటేల్ గోండా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫూల్పూర్లో ఏ పార్టీ ముస్లింని బరిలోకి దింపకపోవడంతో ముస్లింల ఓట్లన్నీ ఎస్పీ అభ్యర్థికేనని కూడా స్థానిక ముస్లిం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫూల్పూర్లో 3 లక్షల మంది కుర్మీలు, ఒక లక్ష మంది జాటవ్ దళితులు, 1.5 లక్షల మంది జాటవేతరులు, దాదాపు 2 లక్షల మంది యాదవులు, 2 లక్షల మంది బ్రాహ్మణులు, మరో 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారు.