ఇనప్పెట్టెలో చిక్కుకుని ఊపిరాడక..
ఇద్దరు చిన్నారుల మృత్యువాత
పిడుగురాళ్ల రూరల్/ పిడుగురాళ్ల : అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇంట్లోని ఇనప్పెట్టెలో చిక్కుకుని మరణించిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల కథనం మేరకు.. సైన్యంలో పనిచేసే ఆకుల బ్రహ్మయ్య, పులగుజ్జుల చినబ్రహ్మయ్య బావా బావమరుదులు. ఎదురెదురు ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. బ్రహ్మయ్య, అశ్విని దంపతుల చిన్న కుమార్తె ఇందు (4). చినబ్రహ్మయ్యు, అనంతలక్ష్మిల కువూర్తె దివ్య (5). బుధవారం సాయంత్రం చిన్నారులిద్దరూ బ్రహ్మయ్య ఇంట్లో ఆడుకుంటూ ఇంట్లోని రెండో అంతస్తులో ఉన్న ఇనప్పెట్టె మూత తీసి లోపల కూర్చున్నారు.
వెంటనే మూత పడిపోవడంతో పాటు ఒక గడియ కూడా పడింది. రాత్రి ఏడు గంటలైనా పిల్లలు కనిపించకపోవడంతో ఇందు తల్లి వెతుకుతూ పెట్టెను గమనించింది. ఎప్పటిలా రెండు గడియలు వేసి ఉండకుండా ఒకటి తెరుచుకొని ఉండటంతో అనుమానంతో మూతతీసి చూసి కుప్పకూలిపోయింది. ఇద్దరు చిన్నారులు ఊపిరాడక కొట్టుమిట్టాడినట్టుగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని చనిపోయి కనిపించారు.