ఈ గాలి... ఈ నేల... సెలయేరు...
చిరుగాలి సితార సంగీతం వినిపించాల్సిన కాలంలో... గాలి పీల్చాలంటే భయం! సంబరం అంబరాన్ని అంటే కాలంలో...ఒంటరి ఆకాశాన్ని చూస్తే భయం! సెలయేరు తీయగా చెలిమి చేసే కాలంలో...నీరు కన్నీరవుతున్న కాలాన్ని చూస్తే భయం!! మన ‘అభివృద్ధి’ రథాల వేగానికి ఈ గాలి...ఈ నేల... సెలయేరు... ఏవీ క్షేమంగా లేవు. అవి క్షేమంగా లేకపోవడం వాటి దుఃఖం మాత్రమే కాదు... ఈ భూగోళం మీద ప్రతి మనిషి దుఃఖం. సామూహిక దుఃఖం.
నీరు కరువై, కరువే బతుకైన కాలంలో వర్షపు నీటిలో ప్రాణాన్ని చూసుకుంటున్న పశ్చిమబెంగాల్ అమ్మాయిని ప్రశాంత్ బిస్వాస్, ఆఫ్రికాలోని డిజిటల్ వ్యర్థాల వికృతిని ఇగోర్ పెట్కోవిక్, బాలీలోని టుకడ్ డ్యామ్‌లో... నీటిలో తన ప్రేమను నింపుతున్న కుర్రాడి సృజనను అలెక్స్ మసి, జార్జియాలోని కొండ, కోన సౌందర్యాన్ని ఎనైస్ స్టుప్క చిత్రించారు. పరిశ్రమల కాలుష్యం వల్ల జీవాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని ‘పోల్యూటెడ్ ల్యాండ్‌స్కేప్’ పేరుతో లు గౌంగ్ చిత్రించారు.చైనాలోని హోలింగల్ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో 120 గొర్రెలను ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేశారు. అక్కడ గొట్టల నుంచి వచ్చే పొగ, ఇక్కడ లేని మేతను మేస్తున్న జీవాలను చూస్తే చాలు... విషయం లోతుగా అర్థమవుతుంది.
ఒక్క చిత్రం వంద మాటలు చెబుతుంది. ఈ ఛాయాచిత్రాలు కూడా అంతే!!