ఆ విషయంలో తాతయ్యలూ ఫాస్టే!
సుబ్బారావు వయస్సు 80 ఏళ్లకు పైచిలుకు ఉంటుంది. ఆయనకు తనకాలం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకు ఆనాటి సినిమా పోస్టర్లను పోస్టు చేస్తూ.. కన్నాంబ నుంచి సావిత్రి వరకు వారి అందాలను పొగుడుతూ.. తన యవ్వన జ్ఞాపకాల్లోకి జారుకుంటారు ఆయన. సహజంగానే ఆ పాత మాధుర్యాన్ని గుర్తుచేసే ఆయన పోస్టులు ఫేస్బుక్లో చాలా ఫేమస్. బాపు బొమ్మల నుంచి జోకుల వరకు ఆయన ఏది పెట్టినా తెగ లైకులు, కామెంట్లు వచ్చేస్తాయి. తాతాగారికీ ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇలా చాలామంది తాతయ్యలు, బామ్మలు ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడి.. తల్లిదండ్రులు స్వదేశంలో ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో ముదిమిప్రాయంలో వారికొక తోడుగా సోషల్ మీడియా మారిపోయింది. ఫేస్బుక్ వాళ్లకు బెస్ట్ ఫ్రెండ్‌గా మారింది.
యువత మాత్రమే కాదు వృద్ధులు కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌ను అత్యధికంగా వాడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. పదేళ్ల కిందట స్నేహితుల కోసం, కాలక్షేపం కోసం యువత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించగా.. ఇప్పుడు ఇదే కారణంతో సోషల్ మీడియాలో ఖాతా తెరుస్తున్నారట. పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత సంతతికి చెందిన ఎస్ శ్యాం సుందర్ ఈ అధ్యయనం నిర్వహించారు. సమాజంలో నిత్యం ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస.. సామాజిక సంబంధాలను పెంచుకోవాలన్న ఆలోచనతో వృద్ధులు ఫేస్బుక్ వాడుతున్నారని ఆయన తెలిపారు. తమ పిల్లలు, ముఖ్యంగా తమ మనవలు ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు.. తెలుసుకోవడానికి చాలామంది తాతయ్య, బామ్మలు ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారని, మానవ సంబంధాలకు వారధిగా ఉంటూ సానుకూల ప్రభావాన్ని ఇది చూపుతుందని ఆయన వివరించారు.