ఫిట్నెస్... శ్రీమంతుడు!
మనకెంతో ఇచ్చిన సొంత ఊరికి తిరిగి ఏమీ ఇవ్వకపోతే లావైపోతాం అని హీరోయిన్ చెప్పిన మాటలు హీరోపై ప్రభావం చూపుతాయ్. అంతే సొంతూరికి మేలు చేయడం కోసం ఆ శ్రీమంతుడు సైకిలేసుకుని వెళతాడు. ‘పోరా శ్రీమంతుడా..’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో పాట. మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ లో సీన్ గుర్తొస్తోంది కదూ. ఈ రీల్ శ్రీమంతుడు గురించి పక్కన పెట్టి, రియల్ శ్రీమంతుల గురించి చెప్పుకుంటే.. కొంతమంది నిజంగానే అప్పుడప్పుడూ సైకిల్ సవారీ చేస్తుంటారు. అయితే ఈ సవారీ ఫిట్నెస్ కోసం.
సల్మాన్ ఖాన్ ఈ టైప్ సైకిల్ ప్రయాణాలు అప్పుడప్పుడూ చేస్తుంటారు. ముంబయ్ రహదారుల్లో ఈ కండల వీరుడు సైకిల్ మీద వెళుతుంటే అదేదో చూడకూడని వింతను చూసినట్లు చూస్తారు. మరి.. శ్రీమంతుడు సైకిల్ తొక్కడమంటే చిన్న విషయమా? తాజాగా ముంబయ్‌లోని బాంద్రా-వొర్లి రహదారిలో సల్మాన్ సైకిల్ రైడ్ చేశారు. ఈయనగార్ని గుర్తు పట్టి జనాలు గుమిగూడే ప్రమాదం ఉంది కాబట్టి, చుట్టూ బైకులు, కారుల్లో బాడీగార్డ్స్ ఫాలో అయ్యారు.
సల్మాన్ తన రైడ్‌ని ఎంజాయ్ చేయాలి కదా మరి. కొంతమందైతే ఈయనగారు సైకిల్లో రావడం చూసి, తమంతట తాముగా తప్పుకుని ‘పోరా శ్రీమంతుడా’ అన్నట్లుగా దారిచ్చే శారు. మరి.. శ్రీమంతుడా? మజాకా? ఇదిలా ఉంటే.. రొమేనియన్ భామ లూలియా వంటూర్తో సల్మాన్ ప్రేమలో ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ఈ ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిందన్నది తాజా వార్త.