Pradeep Yadav
-
జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో... ఐటీ శాఖ సోదాలు
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్, ప్రదీప్ యాదవ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో అదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్ అలియాస్ అనూప్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే వేధిస్తారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే కుట్రల్లో భాగంగానే తమ ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయని జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ విమర్శించారు. అయితే, ఐటీ శాఖ ఆపరేషన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత బాబూలాల్ మరాండీ తేల్చిచెప్పారు. పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్ బీజేపీ నేత ప్రతుల్ షాదియో దుయ్యబట్టారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ సైతం భాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
రైలు ఆలస్యంగా రావడంతో బతికి బయటపడ్డ యువకుడు
సాక్షి, ముంబై: ఆలస్యం అమృతం, విషం అంటారు... కానీ ప్రదీప్ యాదవ్ అనే యువకుడి విషయంలో ఆలస్యం అమృతమే అయింది. ఎలాగంటే... ఠాణే జిల్లాలోని బోయిసర్‌లో నివాసముంటున్న ప్రదీప్ యాదవ్‌ను హత్య చేసేందుకు అతని బంధువులే పథకం పన్నారు. ఎలా హత్య చేసినా పోలీసులకు దొరికిపోయే అవకాశముందని భావించారు. పోలీసుకు దొరకుండా అంతమొందించాలని భావించిన వారు యాదవ్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత తాళ్లతో గట్టిగా కట్టేసి, బోయిసర్ స్టేషన్‌కు కొంత దూరంలో పట్టాలపై పడేసి వెళ్లారు. రైలు కింద పడి మరణించినట్లవుతుందని, కేసు తమపైకి రాకుండా ఉంటుందని భావించారు. అయితే ప్రదీప్‌కు అదృష్టం ఆలస్యం రూపంలో కలిసొచ్చింది. ప్రదీప్‌ను పడేసిన బోయిసర్‌లోని పశ్చిమ మార్గంపై రావాల్సిన రైలు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఈ సమయంలో ప్రదీప్ తనను కాపాడమంటూ గట్టిగా అరవడంతో వాటిని విన్న ప్రయాణికులు అతణ్ని రక్షించి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రదీప్ ప్రాణాలతో బయపడ్డాడు. అక్టోబర్ 5న జరిగిన ఘటన వివరాలను బోయిసర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ విశ్వాస్ పాటిల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం... ప్రదీప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినవారు అతనికి వరుసకు సోదరులే అవుతారని, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నామని చెప్పారు.