సాక్షి, ముంబై: ఆలస్యం అమృతం, విషం అంటారు... కానీ ప్రదీప్ యాదవ్ అనే యువకుడి విషయంలో ఆలస్యం అమృతమే అయింది. ఎలాగంటే... ఠాణే జిల్లాలోని బోయిసర్‌లో నివాసముంటున్న ప్రదీప్ యాదవ్‌ను హత్య చేసేందుకు అతని బంధువులే పథకం పన్నారు. ఎలా హత్య చేసినా పోలీసులకు దొరికిపోయే అవకాశముందని భావించారు. పోలీసుకు దొరకుండా అంతమొందించాలని భావించిన వారు యాదవ్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత తాళ్లతో గట్టిగా కట్టేసి, బోయిసర్ స్టేషన్‌కు కొంత దూరంలో పట్టాలపై పడేసి వెళ్లారు. రైలు కింద పడి మరణించినట్లవుతుందని, కేసు తమపైకి రాకుండా ఉంటుందని భావించారు.
అయితే ప్రదీప్‌కు అదృష్టం ఆలస్యం రూపంలో కలిసొచ్చింది. ప్రదీప్‌ను పడేసిన బోయిసర్‌లోని పశ్చిమ మార్గంపై రావాల్సిన రైలు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఈ సమయంలో ప్రదీప్ తనను కాపాడమంటూ గట్టిగా అరవడంతో వాటిని విన్న ప్రయాణికులు అతణ్ని రక్షించి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రదీప్ ప్రాణాలతో బయపడ్డాడు. అక్టోబర్ 5న జరిగిన ఘటన వివరాలను బోయిసర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ విశ్వాస్ పాటిల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం... ప్రదీప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినవారు అతనికి వరుసకు సోదరులే అవుతారని, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నామని చెప్పారు.
రైలు ఆలస్యంగా రావడంతో బతికి బయటపడ్డ యువకుడు
Published Thu, Oct 10 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement