గోవిందా.. గోవిందా
- వైభవంగా కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు
అహోబిలం (ఆళ్లగడ్డ): నల్లమల కొండల్లో వెలిసిన అహోబిలం క్షేత్రంలో గోవింద నామస్మరణ మారుమోగుతోంది. అహోబిలేశుడిని బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు ఆదివారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉదయం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యపూజలు నిర్వహించిన అనంతరం స్వామిని హంసవాహనంపై స్వామిని కొలువుంచి మంగళ వాయిద్యాలతో, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ వైభవో పేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుడికి మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజయతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎగువ అహోబిలంలో:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఉదయం ఎగువ అహోబిలంలో కొలువైన ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలనృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ జ్వాలనరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.