రుణ గ్రహీతలకు ఆర్బీఐ శుభవార్త
చలన వడ్డీ రుణాల ముందస్తు చెల్లింపులపై జరిమానాలు వద్దని ఆదేశం
ముంబై: రుణ గ్రహీతలకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం తీసుకుంది. చలన వడ్డీ టర్మ్ రుణాల ముందస్తు చెల్లింపుల విషయంలో వ్యక్తిగత రుణగ్రహీతలపై ఎటువంటి జరిమానా విధించవద్దని బ్యాంకులను ఆదేశించింది. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాతా ముగింపు చార్జీలను సైతం విధించరాదని బ్యాంకులకు స్పష్టంచేసింది. తాజా నోటిఫికేషన్ హౌసింగ్, కార్పొరేట్, వాహన, వ్యక్తిగత రుణాల విషయంలో రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూర్చనుంది.
గత నెల పాలసీలోనే సంకేతాలు...
నిజానికి ఈ విషయాన్ని గతనెల 2014-15 మొదటి ద్వైమాసిక పరపతి విధాన ప్రకటనలోనే ఆర్బీఐ బ్యాంకుల దృష్టికి తీసుకువచ్చింది. చలన వడ్డీ రుణాల ముందస్తు చెల్లింపులపై జరిమానాలు వసూలు చేయకుండా తమ కస్టమర్లకు ఊరట కల్పించే విషయాన్ని పరిశీలించాలని అప్పట్లోనే బ్యాంకులకు సూచించింది.
రుణ ముందస్తు చెల్లింపుల విషయంలో మిగిలివున్న మొత్తంపై 2 శాతం వరకూ ప్రీ-పేమెంట్ పెనాల్టీని కొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి. ఫ్లోటింగ్ వడ్డీరేటు ప్రాతిపదికపై గృహ రుణాలకు సంబంధించి ప్రీ-పేమెంట్ జరిమానాగానీ లేదా ఖాతా ముందస్తు చార్జీలు కానీ విధించరాదని రెండేళ్ల క్రితమే ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. తాజా నిర్ణయంతో అన్ని రుణ విభాగాల విషయంలోనూ పాత, కొత్త కస్టమర్లు అందరికీ ఈ నిబంధన వర్తించనుంది