Press clab
-
నాలుగు దశాబ్దాల నాటి ముచ్చట్లు!
సాక్షి, కృష్ణా: విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సీవీఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీ.కాం (1975-1978) చదువుకున్న క్లాస్ మేట్స్ నాలుగు దశాబ్దాల తర్వాత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అంతా ఒక్కసారిగా యంగ్ తరంగ్గా మారిపోయారు. వారంత కలిసిన తరువాత టీనేజ్ ముచ్చట్లు, కాలేజీ రోజులు నెమరు వేసుకున్నారు. అంతా 60 పైబడిన వాళ్లే వయసులో మాత్రమే.. జ్ఞాపకాలకు వయసుతో ఏం సంబంధం? నాటి కబుర్లు నెమరువేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కలుసుకున్న క్లాస్ మేట్స్ అందరి కళ్లలో ఆ నాటి యంగ్ మెరుపులు మళ్లీ మెరిశాయి. ఉత్సాహం ఉరకలు వేసింది. అందరిలో ఎంతో తృప్తి, ఇన్నాళ్లకు కలుసుకున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిలో పెల్లుబికింది. కాలేజీనాటి కబుర్లే కాదు, డిగ్రీ తరువాత ఎవరి ప్రయాణం ఎలా జరిగింది, ఉన్నత చదువులు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసారం, కాలచక్ర భ్రమణం ఎవరెవరిని ఏ తీరానికి తీసుకువెళ్లిందీ చెబుతున్నపుడు ఒక్కోరు ఒక్కో కథకులే. -
విభజనతో తీవ్ర నష్టం : పటేల్
విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని ఎస్సీ గెజిటెడ్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ ఏవీ పటేల్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన రాజకీయ పార్టీలు కీలక దశలోనూ దమననీతి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పార్టీ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో సాగనంపాలని కోరారు. సీమాంధ్రకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు సమైక్యవాదం పేరుతో విడివిడిగా ఉద్యమిస్తున్నార ని, ఇది సరైన విధానం కాదని, సమైక్యవాదులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని కోరారు. విభజనకు అనేక సాంకేతిక అడ్డంకులున్నప్పటికీ కేంద్రం అడ్డగోలుగా విభజనపై అడుగులు వేస్తుందన్నారు. దీన్ని అడ్డుకోకుంటే మిగిలిన రాష్ట్రాలకు ఏదో ఒకరోజు ఇటువంటి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ విషయమై ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించడం అభినందనీయమన్నారు. సమైక్యవాదులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఎస్సీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ ప్రయత్నిస్తుందని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు విభజనను అడ్డుకునేందకు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మాజీ డెప్యూటీ మేయర్ గ్రిటన్, రాజకీయ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి కార్యదర్శి కోట బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటుకు ఓకే
పంజగుట్ట,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆంధ్ర,రాయలసీమ, తెలంగాణ బడుగు,బలహీనవర్గాల ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజనను ఆహ్వానిద్దాం- ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సహృద్భావాన్ని కాపాడుకుందాం, విభజనతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దాం’ తదితరాంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రక్రియ ఎలా జరగాలి అనే అంశంపైనే చర్చలు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా..అవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు కావని అభిప్రాయపడ్డారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వారిని ఇక్కడివారు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారని..ఏనాడూ కూడా ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలు విమర్శించిది లేదని గుర్తుచేశారు. హైదరాబాద్ సెటిలర్స్ ఫోరం ప్రతినిధి కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తాము తెలుగువారిగా గర్విస్తున్నామని తెలంగాణలో నివసిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నామన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని స్పష్టంచేశారు. రాయలసీమ అధ్యయన కమిటీ ప్రతినిధి భూమన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని కానీ రాష్ట్రం ఏర్పడితే తాము ఆంధ్రావారితో కలిసి ఉండలేమని రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రమివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫోరం ఫర్ సిటిజన్స్ ప్రతినిధి సజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైఆంధ్రా ఉద్యమనేత సాంబశివరావు, బహుజన కెరటాలు సంపాదకులు పల్నాటి శ్రీరాములు, విజయవాడ మైనార్టీ రిప్రెజెంటేషన్ ప్రతినిధి సయ్యద్ రషీద్, వేపపల్లె సర్పంచ్ జ్యోతి, జైఆంధ్ర జేఏసీ ప్రతినిధి జైబాబు, రాష్ట్ర కాపునాడు ప్రతినిధి పి.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగదు: ఎంపీ మధుయాష్కీ మల్లాపూర్ : సీఎం కాదు.. ఆయన అబ్బ వచ్చి అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ స్పష్టంచేశారు. మల్లాపూర్ గ్రామంలో బొడ్రాయి పున:ప్రతిష్టకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ కృషి చేశారని..ఇప్పటికైనా పార్టీలకతీతంగా కార్యకర్తలు,నాయకులు తెలంగాణ పున:నిర్మాణంలో పాల్గొనాలని సూచించారు.