విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని ఎస్సీ గెజిటెడ్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ ఏవీ పటేల్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన రాజకీయ పార్టీలు కీలక దశలోనూ దమననీతి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పార్టీ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో సాగనంపాలని కోరారు. సీమాంధ్రకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు సమైక్యవాదం పేరుతో విడివిడిగా ఉద్యమిస్తున్నార ని, ఇది సరైన విధానం కాదని, సమైక్యవాదులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని కోరారు. విభజనకు అనేక సాంకేతిక అడ్డంకులున్నప్పటికీ కేంద్రం అడ్డగోలుగా విభజనపై అడుగులు వేస్తుందన్నారు. దీన్ని అడ్డుకోకుంటే మిగిలిన రాష్ట్రాలకు ఏదో ఒకరోజు ఇటువంటి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
ఈ విషయమై ఇప్పటికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించడం అభినందనీయమన్నారు. సమైక్యవాదులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఎస్సీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ ప్రయత్నిస్తుందని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు విభజనను అడ్డుకునేందకు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు.
మాజీ డెప్యూటీ మేయర్ గ్రిటన్, రాజకీయ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి కార్యదర్శి కోట బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
విభజనతో తీవ్ర నష్టం : పటేల్
Published Fri, Dec 13 2013 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM
Advertisement
Advertisement