తెలంగాణ ఏర్పాటుకు ఓకే
పంజగుట్ట,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆంధ్ర,రాయలసీమ, తెలంగాణ బడుగు,బలహీనవర్గాల ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజనను ఆహ్వానిద్దాం- ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సహృద్భావాన్ని కాపాడుకుందాం, విభజనతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దాం’ తదితరాంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక ప్రక్రియ ఎలా జరగాలి అనే అంశంపైనే చర్చలు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా..అవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు కావని అభిప్రాయపడ్డారు.
ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వారిని ఇక్కడివారు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారని..ఏనాడూ కూడా ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలు విమర్శించిది లేదని గుర్తుచేశారు. హైదరాబాద్ సెటిలర్స్ ఫోరం ప్రతినిధి కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తాము తెలుగువారిగా గర్విస్తున్నామని తెలంగాణలో నివసిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నామన్నారు.
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని స్పష్టంచేశారు. రాయలసీమ అధ్యయన కమిటీ ప్రతినిధి భూమన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని కానీ రాష్ట్రం ఏర్పడితే తాము ఆంధ్రావారితో కలిసి ఉండలేమని రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రమివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫోరం ఫర్ సిటిజన్స్ ప్రతినిధి సజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైఆంధ్రా ఉద్యమనేత సాంబశివరావు, బహుజన కెరటాలు సంపాదకులు పల్నాటి శ్రీరాములు, విజయవాడ మైనార్టీ రిప్రెజెంటేషన్ ప్రతినిధి సయ్యద్ రషీద్, వేపపల్లె సర్పంచ్ జ్యోతి, జైఆంధ్ర జేఏసీ ప్రతినిధి జైబాబు, రాష్ట్ర కాపునాడు ప్రతినిధి పి.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగదు: ఎంపీ మధుయాష్కీ
మల్లాపూర్ : సీఎం కాదు.. ఆయన అబ్బ వచ్చి అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ స్పష్టంచేశారు. మల్లాపూర్ గ్రామంలో బొడ్రాయి పున:ప్రతిష్టకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ కృషి చేశారని..ఇప్పటికైనా పార్టీలకతీతంగా కార్యకర్తలు,నాయకులు తెలంగాణ పున:నిర్మాణంలో పాల్గొనాలని సూచించారు.