బ్యాక్లాగ్ పోస్టుల ఎంపిక జరిగేనా?
అధికారులపై తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఒత్తిడి
దండకాలు మొదలు పెట్టిన మరి కొందరు..
నెల్లూరు(సెంట్రల్):
జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల ఎంపిక జరిగేనా అనే అనుమానం తలెత్తుతోంది. ఈ పోస్టులను తమ వారికే ఇప్పించుకునేందుకు అధికారులపై అధికారపార్టీ నేతలు కొందరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరికొందరు కులసంఘం పేరు చెప్పుకుని పోస్టులు ఇప్పిస్తామని దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు లేకుండా డైరెక్టుగా ఉద్యోగాలు ఇచ్చేస్తుండడంతో అర్హులైన వారికి ఉద్యోగాలు అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో పోస్టులు 84
జిల్లాలోని వివిధ శాఖల్లో కొంత కాలంగా ఉన్న గ్రూప్–4, క్లాస్–4 బ్యాక్లాగ్ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్‌ను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేశారు. అందు కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు విధించారు. మొత్తం పోస్టులు 84 కాగా అందు కోసం 14,072 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించాల్సి ఉంది. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. దరఖాస్తులు పరిశీలించి అనర్హులుగా ఉన్న వారి అప్లికేషన్లను తీసి వేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నాయకులు తమ వారి పేర్లను మాత్రం ఎట్టి పరిస్థితులలో తీసి వేయొద్దని, ఏమైనా సమస్యలు ఉన్నా వారికే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూడాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి అన్ని అర్హతలు ఉన్నా వారి దరఖాస్తులను పక్కన పెట్టాలని హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
వెయ్యి దరఖాస్తుల పరిశీలన
ఇప్పటి వరకు సుమారు 1000 మంది దరఖాస్తులను పరిశీలించారని, వాటిలో సగానికిపైగా పక్కన పెట్టినట్లు సమాచారం. మొత్తంమీద బ్యాక్లాగ్ పోçస్టులపై అధికారపార్టీ నేతల కన్నుపడడంతో అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని బాధితులు వాపోతున్నారు.
దండకాలు మొదలు..
ఒక పక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అనుమానంగా మారుతుంటే మరో పక్క ఓ కులసంఘంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తి బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పించేందుకు ఇప్పటి నుంచే రూ.లక్షల్లో దండకాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో కూడా జిల్లాలోని పలువురి వద్ద ‘మనీస్కీం’ పేరుతో రూ.లక్షల్లో డబ్బులు కట్టించుకుని ఎగవేసిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై అప్పట్లో పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన అందరి వద్ద ‘చైర్మన్’ తమ వాడే అని చెప్పుకుంటూ దండకాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తాం: –మధుసూదన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ
బ్యాక్లాగ్ పోస్టులలో ఎన్ని ఒత్తిడులు మాపై వచ్చినా నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాం. దరఖాస్తుల స్క్రూట్నీ ప్రస్తుతం జరుగుతోంది. ఉన్నతాధికారుల సమక్షంలో అన్ని నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం.