ఎట్టకేలకు అమ్మకానికి ‘స్వాభిమాన్’
జవహర్‌నగర్ ప్రాజెక్టుపై కదలిక
స్వగృహ ప్రాజెక్టులపై టీ సర్కార్ దృష్టి
సీఆర్పీఎఫ్, బిట్స్ పిలానీ ప్రతినిధులతో చర్చలు
త్వరలో ధరల ఖరారు
హైదరాబాద్: ప్రైవేటు బిల్డర్లకు కట్టబెట్టి ఎంతోకొంత కమీషన్ దండుకోవాలన్న దురుద్దేశంతో కొందరు ఉన్నతాధికారులు తెల్ల ఏనుగులా మార్చిన జవహర్‌నగర్‌లోని రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు (స్వాభిమాన్)ను అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ శివారులో ఉన్న ఈ భారీ గృహ సముదాయం పనులు రెండేళ్ల కిందట నిలిచిపోయాయి. ఈ సముదాయంలో మొత్తం 2,858 ఫ్లాట్లు ఉన్నాయి. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రూపురేఖలు మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని విషయంలో ప్రత్యేక నిర్ణయమంటూ తీసుకోలేదు. అయితే కమీషన్ల కక్కుర్తితో కొందరు అధికారులు చేసిన నిర్వాకాన్ని మాత్రం సరిదిద్దాలని భావిస్తోంది. ఈమేరకు గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రస్తుతం ఆ పనిలో కొన్ని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, పెద్దపెద్ద విద్యాసంస్థలతో సంప్రదింపుల్లో ఉన్నారు. తాజాగా కేంద్రప్రభుత్వరంగ సంస్థ అయిన సీఆర్పీఎఫ్ ప్రతినిధులు ఆయనతో చర్చించారు. కొద్దిరోజుల క్రితం వారు ఆ భవనాలను పరిశీలించి కొనేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. మరోవైపు బిట్స్ పిలానీ విద్యా సంస్థ కూడా దాన్ని కొనేందుకు ఉత్సాహం చూపుతోంది. ఆ సంస్థ ప్రతినిధులు కూడా బుర్రా వెంకటేశంతో చర్చించారు. కొద్ది రోజుల్లో ఏ సంస్థ ఎన్ని భవనాలు కొనుగోలు చేస్తుందో స్పష్టత రానుంది. త్వరలో దాని ధరను కూడా నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో ముందుకొచ్చినా...
హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్‌లో ఈ భారీ గృహసముదాయం ఉంది. దీనికి సమీపంలోని ఆల్వాల్‌లో సీఆర్పీఎఫ్ అనుబంధ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ప్రధాన కేంద్రం ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలంతా ఒకేచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గృహసముదాయాన్ని కొనుగోలు చేసేందుకు సీఆర్పీఎఫ్ గతంలో ఉన్నతాధికారులను సంప్రదించింది. అయితే ఈ గృహసముదాయాన్ని వీలైనంత చవకగా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొంతలాభం చూసుకునే ఆలోచనతో ఓ ఉన్నతాధికారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఆర్పీఎఫ్ అధికారులు సంప్రదింపులకు వస్తే సహకరించకపోగా... సమీపంలోనే డంపింగ్‌యార్డు ఉన్నందున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదరగొట్టారు. దీంతో ఆ బేరం కాస్తా ఎత్తిపోయింది. ప్రైవేటు బిల్డర్లకు దాన్ని కట్టబెట్టే యత్నంలో భాగంగా పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత ఎన్నికల కోలాహలం ఉండటంతో అమ్మకం తంతు పూర్తి కాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీంతోపాటు నిర్మాణాలు దాదాపు పూర్తయిన బండ్లగూడ, పోచారంలోని ప్రాజెక్టులను కూడా విక్రయించనున్నారు.
గృహసముదాయ స్వరూపం ఇదీ..
{పాజెక్టు పేరు: స్వాభిమాన్
{పాంతం: హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్
మొత్తం స్థలం: 50 ఎకరాలు
నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాంతం: 10 ఎకరాలు
నిర్మాణానికి అయిన వ్యయం: దాదాపు రూ.350 కోట్లు
ఫ్లాట్ల సంఖ్య: 2,858
అంతస్తులు : 14 చొప్పున