‘ఎం-సెట్’ నిర్వహణలో అక్రమాలు!
అనేకచోట్ల ఆలస్యంగా జరిగిన ‘ప్రైవేట్’ వైద్య పరీక్ష
♦ కొందరు అభ్యర్థులకు నిర్వాహకులు సహకరించారన్న ఆరోపణలు
♦ మంగళవారం అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు
♦ 5,130 మంది హాజరైనట్లు వైద్య శాఖ వెల్లడి
♦ తప్పుడు లెక్కలని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ
♦ రేపు ఫలితాలతోపాటు తుది కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎం-సెట్)లో ‘హైటెక్’ అక్రమాలు జరిగినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించిన యాజమాన్యాలు... విద్యార్థులు, సర్కారు నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో కొంత పట్టు సడలించారు.
దీంతో అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వందలాది మంది విద్యార్థులు హాల్‌టికెట్లు పొందే హడావుడిలోనే మునిగిపోయారు. తమకు హాల్‌టికెట్ డౌన్లోడ్ కాలేదని, దీనిపై హైకోర్టుకు వెళ్తానని కరీంనగర్‌కు చెందిన విద్యార్థిని తండ్రి మార్కండేయ తెలిపారు. ఈ పరీక్షకు భారీగా విద్యార్థులు హాజరైనట్లు సర్కారుకు యాజమాన్యాలు తప్పుడు లెక్కలు ఇచ్చాయని ఆరోపించారు. కాగా, అనేక కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలిసింది.
సీట్లు కొనుగోలు చేసిన విద్యార్థులకు కొన్ని కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వారికి అక్కడి ఇన్విజిలేటర్లు సహకరించారన్న విమర్శలున్నాయి. అంతా గోప్యంగా, ఏమాత్రం బయటకు పొక్కకుండా పకడ్బందీ వ్యూహంతో పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహించాం
ఎం-సెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్రాల్లో పరీక్ష జరిగిందని, మొత్తం 5,130 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష ప్రాథమిక కీని విద్యార్థులకు ఈమెయిల్ చేసినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చన్నారు. శుక్రవారం ఫలితాలను, తుది కీని విడుదల చేస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను, ఇతర సమాచారాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.