శ్రీలంక అధ్యక్షుడి సోదరుని దారుణహత్య
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన సోదరుడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. వివరాలు...రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేన ఆయనపై ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. పారిశ్రామికవేత్త అయిన ప్రియాంతపై గురువారం రాత్రి ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఒక అగంతకుడు దాడి చేశాడు. అనంతరం ఆయనను పొలొన్నారువకు సమీపంలోని కొలంబోకి అదే రోజు రాత్రి తరలించారు. ప్రియాంత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి వర్గాలు ఆయనను ఐసీయూలో ఉంచాయి. మైత్రిపాల సిరిసేన చైనా పర్యటనలో ఉండగా ఈ దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత సిరిసేన స్నేహితుడు కావడం గమనించదగ్గ విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది.