గ్రామీణులు, పేదలకు అనుకూలమైన బడ్జెట్
దేశంలో రైతులు, పేదలు, గ్రామీణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఈసారి బడ్జెట్ రూపొందడం ఎంతో ఆనందంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ అరుణ్ జైట్లీ బడ్జెట్ను అభినందించారు. గ్రామీణభారతాన్ని పటిష్ఠపరిచేందుకు అరుణ్ జైట్లీ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలు, గ్రామీణులు, రైతుల్లో నాణ్యతాపరమైన మార్పు తీసుకురావాలన్నదే తమ ధ్యేయమని, ప్రజలు ఆదరించిన ప్రత్యేక కార్యక్రమాలతో పేదరికాన్ని నిర్మూలించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
ముఖ్యంగా 2016-17 బడ్జెట్ వ్యవసాయం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలతో పాటు, దళిత వ్యవస్థాపకత పైనా దృష్టితో రూపొందించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్తో దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పును చూడొచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. నిర్ణీత కాలపరిమితిలో పేదరికం తొలగించడానికి ఈ బడ్జెట్ ఓ రోడ్ మ్యాప్ అని, రైతుల అభివృద్ధే ధ్యేయంగా పలు చర్యలు తీసుకున్నామని, అందులో ప్రధానమంత్రి కృషి యోజన ముఖ్యమైనదని అన్నారు.
ఈ బడ్జెట్ గ్రామాల్లో రహదారులు, విద్యుత్ సౌకర్యాలపై దృష్టిసారించిందని, 2019 నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు వేయించడంతో పాటు 2018 కల్లా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బడ్జెట్ పేదల సొంతింటి కల నెరవేర్చేలా రూపొందిందని, గ్రామీణ ఉపాధి హామీకి కూడా భారీ కేటాయింపులు జరిగాయని మోదీ వివరించారు. దీంతోపాటు అద్దె ఇళ్లలో ఉండేవారికి బడ్జెట్లో ప్రత్యేక మినహాయింపులు చేకూర్చినట్లు ప్రధాని తెలిపారు.